ఇష్టంతో చదివితేనే ఉజ్వల భవిష్యత్తు: వెరబెల్లి రఘునాథరావు

దండెపల్లి, ఆంధ్రప్రభ: విద్యార్థులు చదువును భారంగా భావించకుండా, సబ్జెక్టుపై ఆసక్తి పెంచుకొని ఇష్టంతో చదివితేనే అద్భుతమైన ఫలితాలు సాధించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవచ్చని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు అన్నారు. సోమవారం దండెపల్లి మండలంలోని వెల్గనూర్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్, కంపాస్ బాక్సులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదో తరగతి విద్యార్థుల జీవితంలో కీలకమైన మైలురాయి అని పేర్కొన్నారు. ఇప్పటి నుంచే పట్టుదలతో చదివి అత్యుత్తమ మార్కులు సాధిస్తే భవిష్యత్తులో లక్ష్యాలను చేరుకోవడం సులభమవుతుందని చెప్పారు. కష్టపడి చదవడం కంటే ఇష్టపడి చదివితే ఏ గమ్యాన్నైనా చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు బొలిశెట్టి రాజన్న, బీజేపీ నాయకులు మొరుపుటాల తులసి, గోపతి రాజయ్య, బండే రవి గౌడ్, బెడద సురేష్, శేఖర్, పత్తిపాక సంతోష్, గడికొప్పుల సురేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.