తృటిలో తప్పిన భారీ ప్రమాదం..

ఇంటి పక్కనే పిడుగు

టీవీ, ఫ్రిజ్, ఫ్యాన్లు, విద్యుత్ మీటర్ దగ్ధం.. గోడలకు బీటలు

జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ : జుక్కల్ మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం గంటపాటు కురిసింది. ఈ క్రమంలో జుక్కల్ మండలంలోని పెద్దఎడ్గి గ్రామంలో పిడుగు పడటంతో తృటిలో భారీ ప్రమాదం తప్పింది.

గ్రామానికి చెందిన సబ్‌దేవర్ శంకర్ ఇంటిలో సుమారు 8 నుంచి 10 మంది కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. వారంతా గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో ఇంటి పక్కనే పిడుగు పడింది. ఆ శబ్దానికి కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా నిద్రలేచి తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

పిడుగు ప్రభావంతో ఇంటి గోడలకు బీటలు ఏర్పడ్డాయి. అలాగే ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిజ్, విద్యుత్ మీటర్, ఫ్యాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ శబ్దానికి ఇంట్లోని వంట పాత్రలు కూడా చెల్లాచెదురుగా పడ్డాయి.

ఇంటి పక్కనే పిడుగు పడినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనతో వారు ఇంకా భయాందోళనల నుంచి పూర్తిగా కోలుకోలేకపోతున్నారు.