us-iran-war-trump-pause-hormuz-houthi-red-sea-analysis-telugu |ట్రంప్ వ్యూహాత్మక విరామం – పశ్చిమాసియాలో వీడని యుద్ధ మేఘాలు..!

  • అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతకు తాత్కాలిక విరామం…
  • దాడులు నిలిపివేసిన అమెరికా
  • ప్రతీకార దాడులు విరమించిన ఇరాన్
  • దౌత్య ప్రయత్నాలకు ఊతం… కానీ ఉద్రిక్తత మాత్రం కొనసాగుతూనే
  • ట్రంప్ ఎందుకు దాడులు నిలిపివేశారు?
  • హోర్ముజ్‌పై ఇరాన్ పట్టుదల…
  • ఎర్ర సముద్రంలో హౌతీల దాడులు…
  • ప్రపంచ చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం

us-iran-war-trump-pause-hormuz-houthi-red-sea-analysis-telugu | ఆంధ్రప్రభ వెబ్, అంతర్జాతీయ ప్రతినిధి: అమెరికా–ఇరాన్ మధ్య దాదాపు రెండు వారాలుగా కొనసాగిన తీవ్ర ఘర్షణకు ప్రస్తుతం తాత్కాలిక విరామం లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై వైమానిక దాడులను తాత్కాలికంగా నిలిపివేసి, దౌత్య చర్చలకు అవకాశం కల్పిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది.

అమెరికా అధికారుల సమాచారం ప్రకారం ప్రస్తుతం సైనిక చర్యలు “హోల్డ్” లో ఉంచబడ్డాయి. ఇదే సమయంలో ఇరాన్ కూడా కొత్త దాడులకు పాల్పడలేదని పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చిన సమాచారం చెబుతోంది. అమెరికా వైమానిక దాడులు నిలిచిపోవడంతో ఇరాన్ కూడా తన ప్రతీకార చర్యలను నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ట్రంప్ ఎందుకు దాడులు నిలిపివేశారు?

ఇరాన్‌పై అమెరికా వరుసగా 13 రోజుల పాటు వైమానిక దాడులు నిర్వహించింది. అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాటికి తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలకు అవకాశం ఏర్పడటం, యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉండటం వంటి అంశాలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒకవేళ ఇరాన్ మళ్లీ దాడులకు దిగితే వెంటనే ప్రతిస్పందించాలని అమెరికా సైన్యానికి ట్రంప్ ఆదేశించినట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. అమెరికా క్షిపణుల నిల్వలు తగ్గుతున్నాయనే వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే ఆ వార్తలను ట్రంప్ ఖండించారు.

“ప్రపంచంలోనే అత్యధిక ఆయుధ నిల్వలు అమెరికా వద్ద ఉన్నాయి. మందుగుండు సామగ్రి కొరత వల్ల దాడులు నిలిపివేయలేదు” అని ట్రంప్ స్పష్టం చేశారు. దౌత్యానికి ఇరాన్ కూడా సానుకూలమేనా? అమెరికా దాడులు ఆగిన నేపథ్యంలో ఇరాన్ కూడా తన ప్రతీకార చర్యలను నిలిపివేసినట్లు సమాచారం.

ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ అమెరికాతో మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గతంలో అమెరికా చర్చలను భంగపరిచిందని ఆరోపించినప్పటికీ, ఇప్పుడు దౌత్యానికి తలుపులు పూర్తిగా మూసివేయలేదని సంకేతాలు ఇచ్చారు.

అమెరికా సైనికుల నష్టాలపై కొత్త లెక్కలు

ఇరాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) తన గణాంకాలను సవరించినట్లు సమాచారం. తాజా వివరాల ప్రకారం… గాయపడిన అమెరికా సైనికుల జాబితాలో మరో 140 మందికి పైగా పేర్లు చేర్చారు. గత వారం మరణించిన నలుగురు సైనికుల వివరాలను కూడా అధికారిక జాబితాలో తిరిగి చేర్చారు. ఈ పరిణామం యుద్ధ నష్టాలపై కొత్త చర్చకు దారితీసింది.

చమురు ధరలు తగ్గినా… అనిశ్చితి మాత్రం కొనసాగుతోంది

యుద్ధానికి తాత్కాలిక విరామం రావడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో కొంత ఉపశమనం కనిపించింది. బ్రెంట్ క్రూడ్ ధర 5.7 శాతం తగ్గింది. అమెరికా క్రూడ్ ఆయిల్ ధర 5.4 శాతం పడిపోయింది. అయితే వినియోగదారులకు వెంటనే ఉపశమనం కనిపించడం లేదు.

మధ్యప్రాచ్య సముద్ర మార్గాల్లో కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా అమెరికాలో పెట్రోల్ ధరలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. చమురు ధరలు తగ్గడంతో అమెరికా స్టాక్ మార్కెట్ ఫ్యూచర్స్ లాభాల్లో ట్రేడయ్యాయి. యుద్ధం మరింత విస్తరించకపోవచ్చనే అంచనాలతో పెట్టుబడిదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపారు.

హోర్ముజ్ జలసంధిపై కొత్త వివాదం

ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మరోసారి అంతర్జాతీయ చర్చలకు కేంద్రబిందువైంది. ఒమాన్ మధ్యవర్తిత్వంలో జరిగిన చర్చల్లో హోర్ముజ్ నిర్వహణకు ప్రాంతీయ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం.

అయితే ఇరాన్ మాత్రం… ఈ జలమార్గాన్ని తామే నిర్వహించాలని, నౌకల నుంచి “సర్వీస్ ఫీజు” వసూలు చేయాలని పట్టుబడుతోంది. ఈ అంశం ప్రపంచ ఇంధన మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశముంది.

సముద్ర రవాణాపై తీవ్ర ప్రభావం

యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడుల తర్వాత… బాబ్ అల్-మందెబ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. హోర్ముజ్ జలసంధిలో కూడా నౌకల రాకపోకలు సాధారణ స్థాయికి చేరలేదు. దీంతో అంతర్జాతీయ వాణిజ్యం, చమురు సరఫరాపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఇజ్రాయెల్ ఆక్ర‌మిత ప్రాంతంలో ఉద్రిక్తత

అమెరికా–ఇరాన్ ఘర్షణలో కొంత విరామం కనిపించినప్పటికీ, ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. నాబ్లస్, రామల్లా, హెబ్రాన్, జెరూసలేం ప్రాంతాల్లో… సైనిక దాడులు, అరెస్టులు,
ఇళ్ల కూల్చివేతలు, సెటిలర్ల హింసాత్మక చర్యలు పెరుగుతున్నట్లు సమాచారం.

మహ్మూద్ అబ్బాస్ పిలుపు

పాలస్తీనా అధ్యక్షుడు మహ్మూద్ అబ్బాస్ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. వెస్ట్ బ్యాంక్‌లో జరుగుతున్న పరిణామాలు సాధారణ హింసాత్మక ఘటనలు కావని, ఆక్రమణను బలపరిచే క్రమబద్ధమైన విధానమని ఆరోపించారు. రెండు దేశాల పరిష్కారానికి అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని కోరారు.

అమెరికాలోనూ విమర్శలు

అమెరికా రాజకీయ వర్గాల్లో కూడా ఈ యుద్ధంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెనేటర్ బెర్నీ సాండర్స్ గాజాలో జరుగుతున్న పరిణామాలకు అమెరికా కూడా బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యుడు థామస్ మాస్సీ మాత్రం ఇరాన్ యుద్ధం వల్ల అమెరికా ఆర్థికంగా, సైనికంగా బలహీనపడిందని విమర్శించారు.

ఉద్రిక్తతకు ప్రధాన కారణాలు

ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తత కొనసాగడానికి ప్రధాన కారణాలు ఇవే…
హోర్ముజ్ జలసంధి వివాదం
యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు
ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో పెరుగుతున్న హింస
సముద్ర వాణిజ్య మార్గాల భద్రతపై కొనసాగుతున్న అనిశ్చితి

దౌత్య చ‌ర్చ‌ల‌పై ప్ర‌పంచ దేశాలు ఎదురుచూపు
యుద్ధానికి విరామం వచ్చింది… కానీ శాంతి ఇంకా దూరంగానే ఉంది. తుపాకులు కాసేపు మౌనంగా ఉండొచ్చు… కానీ వ్యూహాలు మాత్రం ఆగవు. హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ అయితే… ఎర్ర సముద్రం ప్రపంచ వాణిజ్యానికి ఊపిరితిత్తులు. ఈ రెండు మార్గాల్లో ఉద్రిక్తత కొనసాగితే దాని ప్రభావం మధ్యప్రాచ్యానికే పరిమితం కాదు… ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తానికీ విస్తరిస్తుంది. అందుకే ఇప్పుడు ప్రపంచం కాల్పుల శబ్దాన్ని కాదు… దౌత్య చర్చల ఫలితాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తోంది.