ప్రపంచ మడ అడవుల దినోత్సవం. సుందర్బన్‌లో గ్రీన్ ఇండియా చాలెంజ్
2031 నాటికి 100 కోట్ల మొక్కల లక్ష్యంగా హరిత యాత్ర
కోల్‌కతా/హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రపంచ మడ అడవుల దినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ తన 9వ విడత కార్యక్రమాన్ని ప్రపంచ ప్రసిద్ధి చెందిన సుందర్బన్ మడ అడవుల్లో నిర్వహించింది. ఈ సందర్భంగా 500 మందికి పైగా స్థానిక సంరక్షకులు, స్వచ్ఛంద కార్యకర్తల భాగస్వామ్యంతో 10 వేల మడ (మ్యాంగ్రూవ్) మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో అత్యంత విశేషంగా నిలిచింది సుందర్బన్ “టైగర్ విడోస్” భాగస్వామ్యం. పులుల దాడుల్లో తమ భర్తలను కోల్పోయిన మహిళలు జీవితంలో ఎదురైన విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ, నేడు తమ జీవితాలకు ఆధారమైన అదే మడ అడవుల సంరక్షణలో ముందుండడం అందరినీ కదిలించింది. ఒకప్పుడు ఈ అడవుల కారణంగా కుటుంబాలను కోల్పోయిన వారు, ఇప్పుడు అదే అడవులను కాపాడే బాధ్యతను స్వచ్ఛందంగా చేపట్టడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు మాట్లాడుతూ, గోదావరి నది తీరాల నుంచి బెంగాల్‌లోని సుందర్బన్ ఆటుపోట్ల మడ అడవుల వరకు తమ హరిత యాత్ర విస్తరించడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో మడ అడవులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
2031 అక్టోబర్ 15 నాటికి దేశవ్యాప్తంగా 100 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ తన కార్యక్రమాలను మరింత విస్తరిస్తోందని నిర్వాహకులు వెల్లడించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఈ హరిత ఉద్యమంలో భాగస్వాములను చేసి, పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రపంచ మడ అడవుల దినోత్సవం సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను చాటిచెప్పే అరుదైన ఉదాహరణగా నిలిచింది. ముఖ్యంగా సుందర్బన్ మహిళల భాగస్వామ్యం ఈ హరిత ఉద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చే అంశంగా మారింది.
