Stock markets | సెన్సెక్స్ 600కుపైగా పాయింట్ల జంప్…
Stock markets | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 4.3 శాతం క్షీణించి 92 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చమురు ధరలు తగ్గడం, బ్యాంకింగ్, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాల్లో కొనుగోళ్లు పెరగడం, రూపాయి మారకం విలువ బలపడడం వంటి పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.
గత ట్రేడింగ్ సెషన్‌లో 76,059 వద్ద ముగిసిన సెన్సెక్స్, సోమవారం ఉదయం దాదాపు 600 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ఉదయం 9:40 గంటల సమయానికి సెన్సెక్స్ 627 పాయింట్లు ఎగిసి 76,687 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా 176 పాయింట్ల లాభంతో 23,943 వద్ద కొనసాగుతోంది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.24 వద్ద బలపడడం కూడా మార్కెట్‌కు ఊతమిచ్చింది. అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా మారడంతో పెట్టుబడిదారుల కొనుగోళ్లు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
సెన్సెక్స్, నిఫ్టీలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఒరాకిల్ ఫిన్‌సెర్వ్, కేఫిన్ టెక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, లారస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, మోతీలాల్ ఓస్వాల్, పేటీఎమ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ 488 పాయింట్లు, నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 667 పాయింట్ల లాభంతో ట్రేడవుతూ మార్కెట్‌లో సానుకూల ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి.
