ఓటరు జాబితా కసరత్తులో ఎవరు ముందంజ?.. పార్టీల వ్యూహాలపై ఆసక్తికర చర్చ
ఓటరు జాబితా కసరత్తులో ఎవరు ముందంజ?.. పార్టీల వ్యూహాలపై ఆసక్తికర చర్చ
• పార్టీలకు అగ్నిపరీక్షలా ఓటరు జాబితా తయారీ
• పటిష్ట వ్యూహంతో బీఆర్ఎస్ ముందంజ
• రంగంలోకి దిగి శిక్షణనిచ్చిన కేటీఆర్, హరీష్ రావు
• ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో బూత్‌ల వారీ నిఘా, సమీక్షలు
• ఆలస్యంగా అప్రమత్తమైన అధికార కాంగ్రెస్ పార్టీ
హైదరాబాద్, ఆంధ్రప్రభ న్యూస్ నెట్‌వర్క్ ఇన్‌చార్జి: ఓటు వేయించుకోవడం సంగతి సరే… అసలు తమవారికి ఓటుందో లేదో చూసుకోవాలి కదా. ఇప్పుడు రాజకీయ పార్టీల ముందున్న పెద్ద పరీక్ష అదే. ఒక్క ఓటు గెలుపోటములను తారుమారు చేసే అవకాశం ఉండటంతో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది.
బూత్‌లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు? కొత్తగా ఎంతమంది చేరుతున్నారు? ఎవరి పేర్లు తొలగిపోయాయి? చిరునామాలు మారిన వారెంతమంది? అర్హుల పేర్లు గల్లంతైతే గుర్తిస్తున్నదెవరు? అభ్యంతరాలు తెలిపేదెవరు? ఇప్పుడు పార్టీల ముందున్న అసలు పరీక్ష ఇదే.
అయితే ఈ కీలక ప్రక్రియను రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఒకే రీతిలో తీసుకోలేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నెల రోజుల ముందే ప్రత్యేక కార్యాచరణతో రంగంలోకి దిగి బూత్ స్థాయి వరకు యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంది. ప్రత్యేకంగా పార్టీ తరఫున కమిటీని నియమించడంతో పాటు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించి ఓటర్ల లెక్కలను జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. కేటీఆర్, హరీష్ రావులు శిక్షణ అందిస్తూ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు.
అధికార కాంగ్రెస్ మాత్రం ప్రారంభంలో అంతగా దృష్టి పెట్టకపోయినా కీలక దశకు చేరుకున్న సమయంలో వేగం పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో క్షేత్రస్థాయి నేతలు రంగంలోకి దిగారు. ఇక బూత్ స్థాయి వ్యవస్థే తమ బలమని చెప్పుకొనే బీజేపీ ఎస్ఐఆర్‌లో మాత్రం ఆశించిన జోరు చూపలేకపోయినట్లు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి.
ముందస్తు వ్యూహంతో బీఆర్ఎస్ దూకుడు.. చివరి దశలో వేగం పెంచిన కాంగ్రెస్
ఎస్ఐఆర్‌ను బీఆర్ఎస్ కేవలం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియగా కాకుండా రాబోయే ఎన్నికలకు తొలి కసరత్తుగా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రక్రియ ప్రారంభానికి ముందే బూత్ స్థాయి వరకు కార్యాచరణ రూపొందించడంతో పాటు ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసింది.
నెల రోజుల ముందే ప్రత్యేక సాఫ్ట్‌వేర్, స్క్రీన్‌లను అందుబాటులోకి తెచ్చి నియోజకవర్గాలు, బూత్‌ల వారీగా ఓటర్ల వివరాలను పరిశీలించడంతో పాటు బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చింది. కేటీఆర్, హరీష్ రావులు నేరుగా రంగంలోకి దిగి ప్రతి బూత్‌లో ఉన్న ఓటర్లు, కొత్తగా నమోదైన వారు, తొలగిపోయిన పేర్లు, చిరునామా మార్పులు, అర్హులైన కొత్త ఓటర్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేశారు.
బీఎల్ఏలను రంగంలోకి దించి జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎక్కడైనా తేడాలు కనిపిస్తే వెంటనే పార్టీ నాయకత్వానికి తెలియజేయాలని సూచించారు. అర్హుల పేర్లు జాబితాలో లేకపోతే నమోదు చేయించడం, తొలగింపులపై అనుమానాలుంటే అభ్యంతరాలు తెలియజేయడం వంటి చర్యలతో బూత్ స్థాయిలో పూర్తి పట్టు సాధించేందుకు గులాబీ పార్టీ ప్రయత్నిస్తోంది.
ఆలస్యంగా అప్రమత్తమైన కాంగ్రెస్
అధికార కాంగ్రెస్ మాత్రం ఎస్ఐఆర్ ప్రారంభ దశలో ఆశించిన స్థాయిలో దృష్టి సారించలేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం, పార్టీ కార్యక్రమాలతో ముఖ్యనేతలు బిజీగా ఉండటం, బూత్ స్థాయిలో పూర్తిస్థాయి సమన్వయం లేకపోవడం వల్ల ప్రారంభంలో క్షేత్రస్థాయి యంత్రాంగం ఆశించిన వేగంతో స్పందించలేదనే చర్చ జరిగింది.
ప్రక్రియ కీలక దశకు చేరుకున్న తర్వాత పరిస్థితి తీవ్రతను గుర్తించిన పార్టీ జాతీయ నాయకత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతలతో కాన్ఫరెన్స్ కాల్స్ నిర్వహించి ఎస్ఐఆర్‌ను తేలిగ్గా తీసుకోవద్దని సూచించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలు, బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాలను పరిశీలించాలని, అర్హుల పేర్లు తప్పిపోకుండా చూడాలని, స్థానిక నాయకత్వం బీఎల్ఏలతో సమన్వయం చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. సీఎం ఆదేశాల తర్వాత క్షేత్రస్థాయి నాయకత్వంలో కదలిక పెరిగింది. చివరి దశలో కాంగ్రెస్ పార్టీ వేగం పెంచినట్లు కనిపిస్తోంది.
బీజేపీలో ఆశించిన జోరు లేకపోయిందా?.. బీఎల్ఏల పాత్రపై ఫోకస్
ఎన్నికలంటే బూత్.. బూత్ అంటే బీజేపీ అన్న స్థాయిలో క్షేత్రస్థాయి వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చే కమలం పార్టీ ఎస్ఐఆర్‌లో మాత్రం ఆ స్థాయి జోరు చూపలేకపోయిందన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా బూత్ కమిటీలు, కార్యకర్తల నెట్‌వర్క్ ఉన్నప్పటికీ ఓటర్ల జాబితా సవరణ విషయంలో ఆ బలాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయినట్లు పార్టీలోని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బూత్ కమిటీలే పార్టీల కళ్లు.. చెవులు
రాజకీయ పార్టీలకు బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ) పాత్ర అత్యంత కీలకం. ఎన్నికల సంఘం నియమించే బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల జాబితాలను పరిశీలించడం, అర్హుల పేర్ల నమోదుకు సహకరించడం, తొలగింపులు, మార్పులపై అభ్యంతరాలు తెలియజేయడం వంటి అంశాల్లో వీరే పార్టీలకు క్షేత్రస్థాయి కళ్లు, చెవులుగా వ్యవహరిస్తారు.
బీఎల్ఏ వ్యవస్థ ఎంత బలంగా పనిచేస్తే ఓటర్ల జాబితాపై పార్టీకి అంత పట్టు ఉంటుంది. రాష్ట్రస్థాయిలో నేతలు ఎన్ని సమావేశాలు నిర్వహించినా, బూత్‌లో జాబితా పట్టుకుని ఒక్కో పేరు పరిశీలించే యంత్రాంగం లేకపోతే ప్రయోజనం ఉండదు. అందుకే ఎస్ఐఆర్ పూర్తయ్యే నాటికి ఏ పార్టీ బీఎల్ఏలు ఎంత సమర్థంగా పని చేశారన్నది కూడా కీలకంగా మారనుంది.
