కోవిడ్‌పై ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉందాం..
- రోజువారీ జీవితంలో జాగ్రత్తలు తీసుకుందాం
- ముందు జాగ్రత్తగా జీజీహెచ్‌లో ప్రత్యేక కోవిడ్ వార్డు
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండి అవసరమైన ముందు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని.. ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ముందు జాగ్రత్తగా విజయవాడ జీజీహెచ్‌లో 15 పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వదంతులను నమ్మద్దు..
వైద్యులు, సిబ్బందితో పాటు అవసరమైన మందులు, ఉపకరణాలు అన్నింటినీ సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు 45 మందికి పరీక్షలు చేసినా ఎవరికీ పాజిటివ్ రాలేదన్నారు. అయినా ముందస్తు చర్యల్లో భాగంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు. వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అవసరమైన చోట మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలను పాటించాలని సూచించారు. వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.
