తడి, పొడి చెత్త వేర్వేరుగా వేయాలని గ్రామస్తులకు అవగాహన

తాడ్వాయి (ఆంధ్రప్రభ): తాడ్వాయి మండలంలోని చిట్యాల గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడంపై గ్రామస్తులకు సర్పంచ్ రంజిత్ రెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తడి చెత్త బుట్టలో కుళ్లిపోయిన కూరగాయలు, నానిన వస్తువులు, మిగిలిపోయిన ఆహారం, మాంసం వ్యర్థాలు, వాడిపోయిన పూలు వేయాలని సూచించారు. అలాగే పొడి చెత్త బుట్టలో కాగితాలు, ప్లాస్టిక్ వస్తువులు వేయాలని తెలిపారు.

శానిటరీ వ్యర్థాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక డబ్బాలో శానిటరీ ప్యాడ్లు వేయాలని, ప్రమాదకర వ్యర్థాల కోసం ప్రత్యేక చెత్తబుట్టలో పెయింట్ డబ్బాలు, గడువు ముగిసిన మందులు, మందుల సీసాలు, వాడిన సిరంజీలు వంటి వాటిని వేయాలని వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, కరోబార్ శర్వానందరావు, పంచాయతీ సిబ్బంది బాగయ్య, సాయిలు, భూపతి, గ్రామస్తులు నరసింహులు, నీలయ్య, మహిళలు పాల్గొన్నారు.