Mangalagiri | అప్రమత్తమైన వైద్య అధికారులు..

ఎయిమ్స్‌లో కరోనా అనుమానితుడికి చికిత్స.. హోం ఐసోలేషన్‌కు సూచన

Mangalagiri | ఉమ్మడి గుంటూరు బ్యూరో (ఆంధ్రప్రభ): మంగళగిరిలోని ఎయిమ్స్‌లో కరోనా కలకలం చోటుచేసుకుంది. కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తిని వైద్యులు పరీక్షించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తూ ఇంటికి పంపించారు. అవసరమైన జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్య పరిస్థితిలో మార్పులు ఉంటే వెంటనే ఆసుపత్రిని సంప్రదించాలని వైద్యులు సూచించారు.


ఇటీవల జ్వరాలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిమ్స్ యాజమాన్యం అప్రమత్తమైంది. ఆసుపత్రిలో ప్రత్యేక ఫీవర్ వార్డును ఏర్పాటు చేసి, జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో వచ్చే రోగులకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తోంది. అవసరమైన వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు కూడా చేసినట్లు సమాచారం.


మరోవైపు గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్)లోనూ వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వైరల్ జ్వరాలతో వచ్చే రోగులపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు, కొవిడ్ లక్షణాలు కనిపించే వారిని వెంటనే గుర్తించి అవసరమైన పరీక్షలు, చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టారు. ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని, అయితే జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.