Swachhata Pakhwada | విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన కేంద్ర మంత్రి

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో కార్యక్రమం..
పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని పిలుపు

Swachhata Pakhwada | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో నిర్వహించిన స్వచ్ఛతా పఖ్వాడా కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీతో కలిసి ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి పాల్గొన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తోందని వారు పేర్కొన్నారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కేంద్ర మంత్రి సురేష్‌ గోపీ ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌కు రావడం స్వచ్ఛతపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమని విశ్వేశ్వ‌ర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది చూపిన ఉత్సాహం, అంకితభావాన్ని అభినందించారు. పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, పరిశుభ్రతను కేవలం కార్యక్రమంగా కాకుండా జీవన విధానంగా అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.