బస్సు ఆలస్యంతో విద్యార్థుల అవస్థలు..
కన్నాయిగూడెం (ఆంధ్రప్రభ): కన్నాయిగూడెం మండలంలోని లక్ష్మీపురం, దేవాదుల గ్రామాలకు చెందిన విద్యార్థులు సమయానికి బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటూరునాగారం నుంచి వచ్చే బస్సు ప్రతిరోజూ ఆలస్యంగా రావడంతో పాఠశాలకు సమయానికి చేరుకోలేక ముఖ్యమైన సబ్జెక్టుల పాఠాలు మిస్ అవుతున్నాయని విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు ఈ సమస్యతో ఎక్కువగా నష్టపోతున్నామని చెప్పారు.
ఉదయం 9 గంటలకు పాఠశాల ప్రారంభమైనప్పటికీ బస్సు ఆలస్యంగా రావడంతో తాము ఉదయం 10 గంటల ప్రాంతంలోనే పాఠశాలకు చేరుకుంటున్నామని, దీంతో మొదటి పీరియడ్‌తో పాటు కీలకమైన పాఠాలు కోల్పోతున్నామని విద్యార్థులు వాపోయారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు స్పందించి, గూర్రేవుల మీదుగా సమయానికి బస్సు నడిచేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
