నమ్మిన సిద్ధాంతం కోసం రాజీలేని పోరాటం చేసిన నేత: కేసీఆర్
- కాపు సామాజికవర్గ హక్కుల కోసం నిరంతరం పోరాడారు
- తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు తీరని లోటు: కేటీఆర్
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ముద్రగడ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం రాజీలేని పోరాటం చేసిన నాయకుడిగా ముద్రగడ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని కొనియాడారు.
ప్రజా జీవితంలో ముద్రగడ తనదైన ముద్ర వేశారని కేసీఆర్ గుర్తుచేశారు. కాపు సామాజికవర్గ హక్కుల కోసం నిరంతరం పోరాడిన నేతగా ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలకు విశిష్ట సేవలందించిన ఆయన రాజకీయ ప్రస్థానం చిరస్మరణీయమని తెలిపారు. ముద్రగడ మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
