ఏబీవీపీ పిలుపుతో కేసముద్రంలో కళాశాలల బంద్ విజయవంతం
కేసముద్రం, ఆంధ్రప్రభ : ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కళాశాలల బంద్ విజయవంతమైంది.
ఈ సందర్భంగా ఏబీవీపీ మండల నాయకులు నునవత్ గణేష్, చిత్తరి చాణక్య, బానోత్ సురేందర్, ధరవత్ నవీన్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులని, అవి ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని అన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల హక్కుల సాధన కోసం ఏబీవీపీ పోరాటం కొనసాగిస్తుందని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళనలు విరమించబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ కళాశాలల విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
