Flying Squirrel | కార్బెట్ అటవీ ప్రాంతంలో అరుదైన జీవి ప్రత్యక్షం..

Flying Squirrel | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్‌లోని కార్బెట్ నేషనల్ పార్కు సమీప అటవీ ప్రాంతంలో అరుదైన ‘ఎగిరే ఉడత’ చాలా ఏళ్ల తర్వాత కనిపించింది. రామ్‌నగర్ అటవీ ప్రాంతంలోని టేడా గ్రామంలో ఓ గ్రామస్థుడి ఇంట్లోకి ప్రవేశించిన ఈ అరుదైన జీవిని అటవీశాఖ నిపుణులు సురక్షితంగా రక్షించారు.

ఇంట్లో వింత జీవిని గుర్తించిన గ్రామస్థులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న నిపుణులు అది అరుదైన ఎగిరే ఉడతగా గుర్తించారు. అనంతరం దానిని జాగ్రత్తగా పట్టుకుని రక్షించినట్లు సమాచారం.

పేరులో ‘ఎగిరే ఉడత’ ఉన్నప్పటికీ ఇది పక్షుల మాదిరిగా రెక్కలతో ఎగరదు. దాని ముందు, వెనుక కాళ్ల మధ్య ప్రత్యేకమైన చర్మపు పొర ఉంటుంది. చెట్టు పైనుంచి దూకిన సమయంలో ఈ చర్మపు పొరను విస్తరించి గాల్లో జారుతూ ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు చేరుతుంది.

ఈ ప్రత్యేక శరీర నిర్మాణం సహాయంతో ఎగిరే ఉడత సుమారు 80 మీటర్ల దూరం వరకు గాల్లో జారుతూ ప్రయాణించగలదని అటవీశాఖ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా దట్టమైన అడవుల్లో, ఎత్తైన చెట్లపై నివసించే ఈ జీవులు ఎక్కువగా రాత్రి సమయంలో చురుగ్గా ఉంటాయి. దీంతో మనుషుల కంటపడటం చాలా అరుదు.

రామ్‌నగర్ ప్రాంతంలో ఈ అరుదైన జీవి చివరిసారిగా 2014లో కనిపించినట్లు సమాచారం. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఎగిరే ఉడత ప్రత్యక్షం కావడంతో అటవీశాఖ అధికారులు, వన్యప్రాణి ప్రేమికుల్లో ఆసక్తి నెలకొంది. అరుదైన జీవి మళ్లీ కనిపించడం స్థానిక అటవీ ప్రాంతంలోని జీవవైవిధ్యానికి మంచి సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు.