Tumbbad 2 | కల్ట్ హారర్ సీక్వెల్‌కు భారీ క్రేజ్ పెంచిన అప్డేట్‌!

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: భారతీయ సినీ ప్రేక్షకులకు సరికొత్త హారర్ అనుభూతిని అందించిన చిత్రాల్లో ‘తుంబాడ్’ ది ప్రత్యేక స్థానం. ఫోక్లోర్, మైథాలజీ, హారర్ అంశాలను అద్భుతంగా మేళవించిన ఈ చిత్రం విడుదలైన కల్ట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కనున్న ‘తుంబాడ్ 2’కు సంబంధించిన అప్డేట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ గా మారింది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో స్టార్ హీరోయిన్ అలియా భట్ భాగం కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలు, కథలకు ప్రాధాన్యం ఇచ్చే నటిగా అలియా భట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆమె ‘తుంబాడ్ 2’లో కీలక పాత్రలో నటించడంతో సినిమాపై భారీ అంచనాలు వస్తున్నాయి. అయితే అలియా భట్ పాత్ర ఎలా ఉండనుంది? ఆమె కథలో ఎలాంటి ప్రాధాన్యం కలిగి ఉంటుంది? అనే వివరాలు ప్రస్తుతానికి బయటకు రాలేదు.

మరింత భారీగా ‘తుంబాడ్’ ప్రపంచం

‘తుంబాడ్’ తొలి భాగం సాధారణ హారర్ సినిమాలకు భిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. భయం మాత్రమే కాకుండా అత్యాశ, సంపద, పురాణ గాథలు, మానవ స్వభావం వంటి అంశాలను కథలో భాగం చేయడం సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ముఖ్యంగా సినిమాలో సృష్టించిన ప్రపంచం, విజువల్స్, నేపథ్య సంగీతం ప్రేక్షకులపై బలమైన ప్రభావం చూపాయి. ఇప్పుడు సీక్వెల్‌తో ఆ ప్రపంచాన్ని మరింత విస్తరించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తొలి భాగంలోని ప్రత్యేకతను కొనసాగిస్తూనే, కొత్త కథాంశం.. కొత్త పాత్రలు.. మరింత భారీ విజువల్ వరల్డ్‌తో ‘తుంబాడ్ 2’ను రూపొందించనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

‘తుంబాడ్’కు ఎందుకంత ప్రత్యేకత?

2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తుంబాడ్’ మొదట్లో పరిమిత స్థాయిలోనే ఆదరణ పొందినప్పటికీ, ఆ తర్వాత ప్రేక్షకుల ప్రశంసలతో కల్ట్ సినిమాగా మారింది. భారతీయ జానపద కథలు, పురాణాల స్ఫూర్తితో రూపొందించిన కథా ప్రపంచం ఈ సినిమాను ఇతర హారర్ చిత్రాల నుంచి ప్రత్యేకంగా నిలిపింది. థియేటర్లలో రీ-రిలీజ్ అయిన సమయంలోనూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ‘తుంబాడ్’కు ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమైంది. దీంతో సీక్వెల్‌పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అలియా భట్ వంటి స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో ‘తుంబాడ్ 2’కు పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ రానుంది. తొలి భాగం కల్ట్ స్టేటస్‌ను అందుకున్న నేపథ్యంలో సీక్వెల్ ఆ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ‘తుంబాడ్ 2’కు సంబంధించిన ప్రతి అప్‌డేట్ ఇప్పుడు సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.