సింగరేణిని బీఆర్ఎస్, కాంగ్రెస్ దోచుకున్నాయి…

  • రూ.54,879 కోట్ల బకాయిలు చెల్లించలేదు..
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • భూపాలపల్లి సింగరేణి భరోసా యాత్రలో ఘాటు విమర్శలు

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : సింగరేణిని బంగారు బాతుగా భావించి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు దోచుకున్నాయని, కార్మికుల శ్రమకు రావాల్సిన రూ.54,879 కోట్లను చెల్లించకుండా మోసం చేశాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సింగరేణి భరోసా యాత్ర ఘనంగా నిర్వహించారు. భూపాలపల్లి సమీపంలోని చెల్పూర్‌లోని వీఎల్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన సమావేశానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సభలో ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలపై ఘాటు విమర్శలు గుప్పించారు.

సింగరేణి తెలంగాణ గుండె చప్పుడు..

సింగరేణి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని, కార్మికుల సమస్యలపై తాను ఎన్నో ఉద్యమాలు చేశానని కిషన్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సింగరేణి నేడు ప్రభుత్వాల నిర్లక్ష్యంతో చతికిలపడిందని విమర్శించారు.

రెండు పార్టీలూ కార్మికుల శ్రమ దోచుకున్నాయి..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ.25,902 కోట్లు బకాయిలు ఇవ్వలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.26,875 కోట్ల బకాయిలు పెంచిందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు కలిపి రూ.54,879 కోట్ల కార్మికుల శ్రమ ఫలితాన్ని నిలిపివేశాయని అన్నారు. అలాంటి పార్టీలకు సింగరేణి ప్రాంతంలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మండిపడ్డారు.

మోదీతోనే సింగరేణికి కొత్త ఊపు..

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు బ్లాకుల కేటాయింపులో పారదర్శకత తీసుకొచ్చామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తాడిచెర్ల బొగ్గు బ్లాక్-2ను సింగరేణికి కేటాయించడం ద్వారా 434 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు, రానున్న 40 ఏళ్ల ఉత్పత్తి, సుమారు రూ.1.29 లక్షల కోట్ల టర్నోవర్ సాధించే అవకాశం ఏర్పడిందన్నారు. దేశంలోనే అతిపెద్ద బొగ్గు బ్లాక్‌గా దీనిని ‘బాహుబలి బొగ్గు బ్లాక్’గా నామకరణం చేశామని తెలిపారు.

కేసీఆర్–రేవంత్ పాలనే కారణం..

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోవడానికి, నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి లేకపోవడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాల విధానాలే కారణమని కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణి కార్మికులు చైతన్యవంతులై ఈ రెండు పార్టీలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు వెంకట రమణారెడ్డి, రాకేష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ రెడ్డి, ఎరుకల గణపతి,భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు నిశిదర్ రెడ్డి, బీఎంఎస్ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.