మరో బాంబ్ పేల్చిన ట్రంప్ !!
- ‘గార్డియన్ ఆఫ్ హోర్ముజ్’గా అమెరికా..
- హోర్ముజ్ జలసంధిపై అమెరికా ఆధిపత్యం?..
- 20% కార్గో రుసుము వసూలు చేస్తామన్న ట్రంప్
- ఇరాన్‌పై మళ్లీ దిగ్బంధనం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు
- ఉద్రిక్తతలతో చమురు ధరలకు మళ్లీ రెక్కలు..
- ఇరాన్ తీవ్ర అభ్యంతరం
ఆంధ్రప్రభ, వాషింగ్టన్ : ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz)పై అమెరికా కంట్రోల్ తీసుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ జలసంధి గుండా రవాణా అయ్యే అన్ని కార్గోలపై 20 శాతం రుసుము వసూలు చేస్తామని ప్రకటించారు. భద్రత కల్పించడానికి అయ్యే ఖర్చును భర్తీ చేసేందుకు ఈ రుసుము విధిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, “హోర్ముజ్ జలసంధికి మేమే సంరక్షకులం (Guardian of Hormuz) అవుతాం. అవసరమైతే దానిని మేమే నిర్వహిస్తాం” అని పేర్కొన్నారు. అనంతరం సోషల్ వేదికగా చేసిన పోస్టులో ఇరాన్‌పై అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ నౌకలు లేదా వాటి వినియోగదారులకే ఈ దిగ్బంధనం వర్తిస్తుందని, మిగతా దేశాలకు జలసంధి వినియోగంపై ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేశారు.
ట్రంప్ ప్రకటనకు ఇరాన్ తీవ్రంగా స్పందించింది. హోర్ముజ్ జలసంధి నిర్వహణలో అమెరికా జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, తమ సార్వభౌమ హక్కులను కాపాడుకుంటామని ఇరాన్ సైనిక ప్రతినిధి ప్రకటించారు. అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల జరిగిన వైమానిక దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ పరిణామాల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై కూడా కనిపించింది. హోర్ముజ్ జలసంధి భద్రతపై అనిశ్చితి పెరగడంతో అమెరికా క్రూడ్ ఆయిల్ ధరలు ఒకే రోజులో 5 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు సుమారు 75 డాలర్ల స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ మార్గంలో ఉద్రిక్తతలు కొనసాగితే ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
