గంజాయిపై ఉక్కుపాదం..
- ఆరు నెలల్లో 450 కేజీల గంజాయి స్వాధీనం..
- 123 మంది అరెస్ట్
- యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి..
- పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ పిలుపు
ఖమ్మం, ఆంధ్రప్రభ : యువత బంగారు భవిష్యత్తును మాదకద్రవ్యాల కోసం నాశనం చేసుకోవద్దని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందని తెలిపారు. యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని వెల్లడించారు.
జిల్లా సరిహద్దులు, జాతీయ రహదారులపై నిఘాను మరింత కట్టుదిట్టం చేసి, నిరంతర వాహన తనిఖీలతో అక్రమ రవాణా ముఠాలను పట్టుకుంటున్నామని చెప్పారు. టాస్క్‌ఫోర్స్, ఈగల్ ఫోర్స్, స్థానిక పోలీసుల సమన్వయంతో రహస్య ఆపరేషన్లు నిర్వహిస్తూ గంజాయి సరఫరా మార్గాలను గుర్తిస్తున్నట్లు తెలిపారు.
గత ఆరు నెలల్లోనే 55 కేసులు నమోదు చేసి, సుమారు రూ.2.24 కోట్ల విలువైన 450 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 123 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇందులో గంజాయి రవాణాకు పాల్పడిన 20 మంది, విక్రయించిన 60 మంది, వినియోగించిన 70 మందిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
గంజాయి నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు మూలాలను గుర్తించి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడానికి పనిచేస్తున్నాయని సునీల్‌దత్ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా కొనసాగిస్తూ, రవాణా నెట్‌వర్క్‌ను ఛేదించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
యువతపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి రవాణా, విక్రయాలు లేదా సాగుకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
గంజాయి విక్రయించే వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడీ చట్టం కూడా అమలు చేస్తామని హెచ్చరించారు. గంజాయి వినియోగం యువతను నేరాల వైపు నెడుతుందని, అందుకే పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
లాడ్జీలు, బస్టాండ్లు, కళాశాలలు, లైబ్రరీలు వంటి ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, సివిల్ డ్రస్‌లో పోలీసులు సంచరిస్తూ గంజాయి సరఫరాదారులను గుర్తించే చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. జిల్లాను పూర్తిస్థాయిలో గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని ఆయన పిలుపునిచ్చారు.
