జిల్లాలో యువజన అభివృద్ధి దిశగా అడుగులు
జిల్లా యువజన కార్యక్రమాల సమన్వయ కమిటీ సమావేశంలో వార్షిక కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం
మై భారత్ నమోదులు, యూత్ హాస్టల్ పునర్నిర్మాణంపై దృష్టి
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లాలో యువత సాధికారత, నాయకత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల విస్తరణకు మరింత వేగం చేకూర్చే దిశగా జిల్లా యువజన కార్యక్రమాల సమన్వయ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వ “మై భారత్” కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా అమలు చేయడం, యువతను జాతీయ నిర్మాణ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం, విజయవాడ యువజన హాస్టల్ పునర్నిర్మాణానికి సంబంధించి కార్యాచరణను వేగవంతం చేయడం, 2026 సంవత్సరానికి సంబంధించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం తెలపడం వంటి అంశాలపై సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా యువజన కార్యక్రమాల సమన్వయ కమిటీ సమావేశంలో విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
సమావేశంలో కమిటీ కార్యదర్శి, ఎన్టీఆర్ జిల్లా యువజన అధికారి బి. ప్రదీప్ కుమార్ కేంద్ర ప్రభుత్వ యువజన కార్యక్రమాల వార్షిక కార్యాచరణ ప్రణాళికను సభ్యుల ముందుంచారు. జిల్లాలో “మై భారత్” కార్యక్రమాల అమలు, యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే వ్యూహాలు, పోర్టల్‌లో భారీ స్థాయిలో యువత నమోదు చేపట్టేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై సభ్యులు సమగ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ మాట్లాడుతూ, యువతకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు ప్రతి గ్రామం, ప్రతి విద్యాసంస్థ, ప్రతి యువకుడికి చేరేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లాలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ యూనిట్లు, నెహ్రూ యువ కేంద్ర సంస్థ, యువజన సంఘాలు, పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌లు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో మై భారత్ నమోదులను పెద్దఎత్తున చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఉన్నత విద్యా సంస్థలో మై భారత్ చాప్టర్స్ ఏర్పాటు చేసి యువతను జాతీయ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సూచించిన కలెక్టర్, జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో నమోదులను ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహించాలని తెలిపారు. అవసరమైతే విద్యాసంస్థల అధిపతులతో భౌతికంగా లేదా వర్చువల్ విధానంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
విజయవాడ యువజన హాస్టల్ పునర్నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చించిన జిల్లా కలెక్టర్, అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా యువజన హాస్టళ్ల నిర్వహణ బాధ్యతలను 2026 ఏప్రిల్ నుండి అధికారికంగా “మై భారత్”కు బదిలీ చేసిన నేపథ్యంలో, విజయవాడ యువజన హాస్టల్ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రజా పనుల శాఖ ద్వారా రూ.7.76 కోట్ల వ్యయంతో సమగ్ర ప్రతిపాదనను సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖకు సమర్పించినట్లు అధికారులు సమావేశానికి వివరించారు.
జిల్లాలో యువత సాధికారత, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ వికాసం, స్వచ్ఛంద సేవ, ఉపాధి అవకాశాల కల్పన, సామాజిక సేవా కార్యక్రమాల అమలు వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన 2026 వార్షిక కార్యాచరణ ప్రణాళికకు సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇప్పటికే అమలులో ఉన్న వివిధ ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేసి యువజన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. యువజనాభివృద్ధికి అంతర్-శాఖల సమన్వయం అత్యంత అవసరమని పేర్కొన్న కలెక్టర్, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, క్రీడలు, యువజన సేవలు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌వైకేఎస్, పోలీసు, ఆరోగ్యం, సాంఘిక సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, డిజిటల్ అక్షరాస్యత, విపత్తు నిర్వహణ తదితర శాఖలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు.
సాంకేతిక నైపుణ్య శిక్షణ, యువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై అవగాహన, ఆరోగ్య చైతన్యం, యువ అపద మిత్ర వాలంటీర్ల శిక్షణ వంటి అంశాలపై బహుళ శాఖల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని యువత కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యువజన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని వ్యక్తిత్వ వికాసంతో పాటు సమాజాభివృద్ధిలోనూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ఎన్టీఆర్ జిల్లా మై భారత్ జిల్లా యువజన అధికారి బి.ప్రదీప్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
