ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె. హరిత

ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సత్వరమే పరిష్కరించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు.

సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం. డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా సిర్పూర్-టి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన మంగెన భూదేవి తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. దహేగాం మండల కేంద్రానికి చెందిన భుతే దేవేందర్ ఎరువుల దుకాణంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఆసిఫాబాద్ మండలం కౌటగూడ గ్రామానికి చెందిన గెడం పద్మ తన భర్త మరణించడంతో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఆర్థిక సాయం అందించాలని కోరారు. సిర్పూర్-టి మండల కేంద్రంలోని రైల్వే కాలనీకి చెందిన గాదె సుభద్ర గృహజ్యోతి పథకం కింద విద్యుత్ రాయితీ వర్తింపజేయాలని అర్జీ సమర్పించారు.

కేరమెరి మండలం గోయగాం గ్రామానికి చెందిన పలువురు గ్రామస్థులు ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో నిరుపేదలను పరిగణనలోకి తీసుకోవడం లేదని, అర్హులైన పేదలను గుర్తించి ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామానికి చెందిన దుర్గం కావేరి తన పిల్లలకు గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించాలని దరఖాస్తు అందజేశారు.

కాగజ్‌నగర్ మున్సిపాలిటీకి చెందిన చాపిడి సరోజ తనకు మున్సిపాలిటీలో మెప్మా విభాగంలో కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా ఉపాధి కల్పించాలని కోరగా, దహేగాం మండలం ఐనం గ్రామానికి చెందిన కొట్లూరి దుర్గా గౌడ్ తాను సాగు చేస్తున్న ప్రభుత్వ భూమికి పట్టా మంజూరు చేసి పాసుపుస్తకం జారీ చేయాలని దరఖాస్తు సమర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ, ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.