దోమకొండ అండర్ డ్రైనేజీ నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు: సర్పంచ్ నరసయ్య

దోమకొండ, ఆంధ్రప్రభ : దోమకొండ మండల కేంద్రంలోని కందకం ప్రాంతంలో అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ రూ.3 కోట్ల నిధులను మంజూరు చేయించినట్లు దోమకొండ గ్రామ సర్పంచ్ ఐరేని నరసయ్య తెలిపారు.

కందకం ప్రాంతంలో మురుగు కాలువ లేకపోవడంతో స్థానిక ప్రజలు దుర్వాసన, పారిశుద్ధ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు.

అత్యవసరంగా అండర్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం సమర్పించగా, ఆయన వెంటనే సంబంధిత శాఖ మంత్రులతో మాట్లాడి రూ.3 కోట్ల నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకున్నారని నరసయ్య వివరించారు.

ఈ సందర్భంగా అండర్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి, ఇన్‌చార్జి మంత్రి సీతక్కకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సర్పంచ్ ఐరేని నరసయ్య కృతజ్ఞతలు తెలిపారు.