చిన్నారుల ఆరోగ్య రక్షణకు నులిపురుగుల నివారణ మాత్రలు తప్పనిసరి
చిట్యాల, ఆంధ్రప్రభ: ఒకటి నుంచి 13 ఏళ్ల వయస్సు గల చిన్నారులందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని చిన్నకాపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ పిలుపునిచ్చారు.
సోమవారం చిట్యాల మండలం చిన్నకాపర్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ మాట్లాడుతూ, చిన్నారుల్లో నులిపురుగుల సమస్య వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అందుకే ప్రభుత్వం ప్రతి ఏడాది జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా ఈ మాత్రలు వేయించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు కూడా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ మాత్రలు అందజేస్తున్నట్లు తెలిపారు.
ఆరోగ్యవంతమైన బాల్యం దేశాభివృద్ధికి పునాదని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
