festival | శివనామస్మరణతో మార్మోగిన క్షేత్రం

festival | నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం స్వామి, అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపారు.

ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు.

స్వర్ణరథోత్సవానికి ముందు దేశంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం సస్యశ్యామలంగా ఉండాలని ఆలయ అర్చకులు లోకకల్యాణ సంకల్పం చేశారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, అకాల మరణాలు, అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు వంటి అనర్థాలు సంభవించకుండా దేశం సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అనంతరం రథారూఢులైన స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి, భక్తుల శివనామస్మరణ, వేదమంత్రోచ్ఛారణల నడుమ ఉదయం 7.30 గంటలకు స్వర్ణరథోత్సవాన్ని ప్రారంభించారు. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు రథోత్సవం నిర్వహించగా, వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.

సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా కోలాటం, తప్పెట చిందులు తదితర జానపద కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి. ఆంజనేయులు, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు ఏ.వి. రమణ, ఆలా అనిల్ కుమార్, ఆలయ విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి కె. వేంకటేశ్వరరావు, అర్చకులు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.