డీవీఆర్, టీఎన్ సంస్మరణ సభ విజయవంతం చేయాలి..
వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
కడెం, ఆంధ్రప్రభ : ఈనెల 27న అదిలాబాద్ జిల్లా ఉట్నూరు పట్టణంలోని నాగిరెడ్డి నగర్లో నిర్వహించనున్న కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు (డీవీఆర్), తరిమెల నాగిరెడ్డి (టీఎన్) సంస్మరణ బహిరంగ సభను విజయవంతం చేయాలని గ్రామీణ పేదల సంఘం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ధారంగుల ఎల్లయ్య పిలుపునిచ్చారు.
సోమవారం కడెం మండల కేంద్రంలో సంఘం నాయకులతో కలిసి సంస్మరణ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యత కేంద్రం (మార్క్సిస్టు-లెనినిస్టు) వ్యవస్థాపక నాయకులు కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డిల సంస్మరణ సభ ఈనెల 27న సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉట్నూరులోని నాగిరెడ్డి నగర్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ బహిరంగ సభకు గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేతావత్ రామదాసు అధ్యక్షత వహిస్తారని చెప్పారు. సభలో ఓపీడీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. విజయేందర్ రావు, గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. వెంకటాద్రి, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అత్రం భుజంగరావు, ఓపీడీఆర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు అంబాల మహేందర్, మంచిర్యాల జిల్లా గ్రామీణ పేదల సంఘం అధ్యక్షుడు ధారంగుల ఎల్లయ్య, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా గ్రామీణ పేదల సంఘం అధ్యక్షుడు కుటికల శంకర్, తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పురక బాపూరావు పాల్గొని ప్రసంగించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల నర్సయ్య, నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం మున్నయ్య, జన్నారం మండల అధ్యక్షుడు బోడ కిషన్, దస్తూరాబాద్ మండల అధ్యక్షుడు బాలసాని మల్లేష్ గౌడ్, ఖానాపూర్ మండల అధ్యక్షుడు దర్శనాల మల్లేష్, మహిళా మండల అధ్యక్షురాలు దేవరకొండ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
