సర్ ప్రక్రియకు మూడు నెలల గడువు పెంచాలి..

కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా

నంద్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రజలకు సరైన అవగాహన కల్పించకుండా ఈ నెల 14తో గడువు ముగిస్తున్నట్లు ప్రకటించడం అన్యాయమని సీపీఐ నాయకులు ఆరోపించారు. ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి, ఎస్‌ఐఆర్ ప్రక్రియను మరో మూడు నెలలు పొడిగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నంద్యాల కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన ఈ నిరసన అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. బాబా ఫక్రుద్దీన్, పట్టణ కార్యదర్శి కె. ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యుడు జి. నాగరాముడు, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. సోమన్న, జిల్లా సమితి సభ్యుడు డి. శ్రీనివాసులు, పట్టణ సహాయ కార్యదర్శి భూముని శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై బీఎల్‌వోలకు తగిన అవగాహన కల్పించలేదని ఆరోపించారు. గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించి ప్రజలకు పూర్తి సమాచారం అందించాల్సి ఉండగా, అలాంటి కార్యక్రమాలు ఎక్కడా నిర్వహించకుండా గడువు ముగుస్తోందని ప్రకటించడం దుర్మార్గమని విమర్శించారు.

ఎన్నికల అధికారులు స్పందించి ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఎస్‌ఐఆర్ ప్రక్రియకు అదనపు గడువు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

చనిపోయిన వారి పేర్లు, విదేశాల్లో శాశ్వతంగా నివసిస్తున్న వారి ఓట్లను తొలగించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఎస్‌ఐఆర్ పేరుతో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న నిజమైన ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు.

జిల్లా వ్యాప్తంగా 100 శాతం దరఖాస్తు ఫారాలు పంపిణీ చేశామని ఎన్నికల అధికారులు చెబుతున్నది వాస్తవానికి విరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘంతో సంప్రదించి ఎస్‌ఐఆర్ ప్రక్రియకు గడువు పొడిగించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.