గ్రామంలో ఒక్క ఓటు కూడా పోకూడదు: సర్పంచ్

అచ్చంపేట (ఆంధ్రప్రభ): ఉప్పరిపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను సోమవారం సర్పంచ్ బొజ్జ గీతా అమరేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలు, బీఎల్‌ఏలతో మాట్లాడిన ఆమె గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఏ ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ తమ ఓటరు నమోదు వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని కోరారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఉప్పరిపల్లి గ్రామస్తులు తమ ఓటును స్వగ్రామంలోనే నమోదు చేసుకునేలా వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే చోట మాత్రమే ఓటు నమోదు ఉండాలని, రెండు ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకుంటే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

ప్రతి ఓటు విలువైనదని, “ఒకే వ్యక్తి – ఒకే ఓటు” అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. గ్రామంలోని అర్హులైన ఓటర్లందరూ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొని తమ వివరాలను సరిచేసుకోవాలని సూచించారు.