చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ..
వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : జాతీయ డీవార్మింగ్ డే సందర్భంగా సోమవారం బ్రాహ్మణ వీధిలోని తపస్విని కిడ్స్ ప్లే స్కూల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. వైద్య సిబ్బంది చిన్నారులకు మాత్రలు వేయించి, పేగు పురుగుల నివారణతో పాటు పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించే డీవార్మింగ్ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని వివరించారు.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం జే. రామ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం ప్రతి విద్యాసంస్థ బాధ్యత అని అన్నారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహార స్థితి మెరుగుపడేందుకు డీవార్మింగ్ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ప్రతి డీవార్మింగ్ కార్యక్రమంలో తమ పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం స్వప్న,లీలావతి,ఆశా వర్కర్లతో పాటు పాఠశాల సిబ్బంది వరలక్ష్మి, స్వప్న, వర్షిత, కావలి చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.
