Lenin| ‘లెనిన్’ మూవీతో స్టార్ అయిపోయాడు!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అఖిల్ లెనిన్ పాత్రలో ప్రాణం పెట్టి నటించాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో అఖిల్ కనబరిచిన నటన అద్భుతమనే చెప్పాలి.
అయితే, ఈ సినిమాలో అఖిల్‌తో పాటు అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న మరో నటుడు ప్రమోద్ పంజు. సినిమాలో అఖిల్ స్నేహితుడిగా కనిపించిన ఈ నటుడు, తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. దీంతో అసలు ఎవరీ నటుడు? అంటూ ప్రస్తుతం ప్రేక్షకులంతా సామాజిక మాధ్యమాల్లో ప్రమోద్ గురించి వెతకడం మొదలుపెట్టారు.
సీరియల్స్ నుండి సిల్వర్ స్క్రీన్ వరకు.. ప్రమోద్ ప్రయాణం..
ప్రమోద్ పంజూ ఒక కన్నడ నటుడు. కన్నడంలో సీరియల్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించారు. ప్రభాస్ హీరోగా వచ్చిన ‘సలార్’ సినిమాలో బాచిరాజా మన్నార్ పాత్రలో మెప్పించిన ప్రమోద్, ఆ గుర్తింపుతోనే ‘లెనిన్’ సినిమాలో కీలక పాత్రను సంపాదించుకున్నాడు.
‘లెనిన్’లో నటనా విశ్వరూపం..
లెనిన్ సినిమాలో ప్రమోద్ తన నటనా విశ్వరూపాన్ని చూపించాడనే చెప్పాలి. సినిమా ప్రథమార్థంలో (ఫస్ట్ హాఫ్) హీరో స్నేహితుడిగా పాజిటివ్ రోల్‌లో కనిపిస్తూనే.. ద్వితీయార్థంలో (సెకండ్ హాఫ్) నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచాడు. కొన్ని సన్నివేశాల్లో అయితే అఖిల్‌కు సరిసమానంగా నటిస్తూ సినిమా స్థాయిని పెంచేశాడు.
ప్రస్తుతం ‘లెనిన్’ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. అఖిల్ కెరీర్‌లో ఇది తొలి ఘన విజయం కావడంతో అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తనదైన మార్క్ రైటింగ్‌తో, సినిమాను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
