విద్యుత్ షాక్‌తో జనసేన కార్యకర్త మృతి

దర్శి, (ఆంధ్రప్రభ): దర్శి మండలం బసిరెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని లింగన్నపాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త నంద్యాల వెంకటేశ్వర్లు (32) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. ఎలక్ట్రికల్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న వెంకటేశ్వర్లు శనివారం పొలంలో ఉన్న బోరు మోటార్‌ను మరమ్మతు చేస్తుండగా విద్యుత్ సరఫరా జరగడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ఈ ఘటనపై దర్శి మండల జనసేన నాయకుడు పుప్పాల పాపారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లు జనసేన పార్టీలో క్రియాశీల కార్యకర్తగా సేవలందించారని పేర్కొంటూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనను రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.