మేడిగడ్డ అందుకే కుంగింది…
- ‘పవర్ పాయింట్’ బాంబ్:
- ఇసుక పునాదులపై మేడిగడ్డ
- రీడిజైన్ పేరుతో దోపిడీ..
- మేడిగడ్డ వద్ద బ్యారేజ్ వద్దని హెచ్చరించారు..
- నిర్మాణ లోపాలపై తీవ్ర ఆరోపణలు
- తదుపరి చర్యలు ఉంటాయి..
- కాళేశ్వరంపై నిపుణుల నివేదికలే ఆధారం..
- కాళేశ్వరం కథను ప్రజల ముందుంచిన రేవంత్..
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, నిర్మాణ లోపాలు, అందులో జరిగిన భారీ అవినీతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రజాభవన్ వేదికగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల సమక్షంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ద్వారా ఆధారాలతో సహా సంచలన విషయాలను వెల్లడించారు.
ఏడాదిన్నరకే కుంగిన మేడిగడ్డ!
ప్రెజెంటేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “కేసీఆర్ తన మెదడును రంగరించి, అహంతో ఇసుక మీద కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ కేవలం ఏడాదిన్నరకే కుంగిపోయింది” అని మండిపడ్డారు. బ్యారేజీలు లేదా డ్యామ్‌లు కడితే వాటిని విడతల వారీగా 25 శాతం చొప్పున నీటితో నింపాలని, కానీ కేసీఆర్ మాత్రం కేవలం ప్రచార ఆర్భాటం కోసం, నీళ్లు కనిపించాలనే ఆశతో కట్టిన ఏడాదికే బ్యారేజీలను పూర్తి స్థాయిలో నింపేశారని ఆరోపించారు.
స్థాయికి మించి నీటిని నిల్వ చేయడం వల్ల బ్యారేజీలపై ఒత్తిడి ఎక్కువైందని, సరైన సాయిల్ టెస్టులు చేయకుండా ఇసుక మీదనే కట్టడం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయని సీఎం స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ వెన్నుపూస లాంటిదని, అలాంటి ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణమైన తప్పులన్నీ తామే చేసి, ఇప్పుడు వారం రోజులు సమయం ఇస్తే ఏదో చేస్తామంటూ బీఆర్ఎస్ నేతలు మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లతో మాట్లాడిస్తూ ప్రతిపక్షం అపోహలు సృష్టించే పనిలో పడిందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
వాళ్లు ఇంజనీర్లు కాదు.. మ్యానుప్యులేటర్స్!
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులేమీ ఇంజనీర్లు కాదు.. వారు నిజాలను అబద్ధాలతో మభ్యపెట్టే మ్యానుప్యులేటర్స్” అని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు క్వాలిటీగా కట్టి ఉంటే.. డబ్బులు తిన్నా కూలిపోయేది కాదు కదా అని ప్రశ్నించారు. 2020లో బ్యారేజీలో, 2022లో వరదలకు కన్నెపల్లి పంప్‌హౌస్ మునిగిపోయినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని, సమస్యను సకాలంలో గుర్తించకపోవడం వల్లే 2023 అక్టోబర్‌లో ఆరు పిల్లర్లు కూలిపోయాయని రేవంత్ రెడ్డి ఆధారాలతో చూపించారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తుమ్మడిహట్టి దగ్గర రూ. 38 వేల కోట్ల బడ్జెట్‌తో 16 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందించేలా ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు గోదావరి నీటిని తరలించేందుకు ఆనాడే కాంగ్రెస్ కృషి చేసిందని, అయితే మహారాష్ట్రలోని కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయనే అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కేవలం కమీషన్లు, నిధులు కొల్లగొట్టేందుకే రీ-డిజైన్ చేశారని ఆరోపించారు.
హెచ్చరికల బేఖాతరు.. నచ్చినట్టు నివేదికలు !
మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించవద్దని ఆనాడే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హెచ్చరించినప్పటికీ, మాజీ సీఎం కేసీఆర్ ఆ నివేదికను పూర్తిగా తొక్కిపెట్టారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. దానికి బదులుగా తనకు అనుకూలంగా రిపోర్టు వచ్చేలా బాధ్యతలను ‘వ్యాప్కోస్’ (WAPCOS) సంస్థకు అప్పగించారని ధ్వజమెత్తారు. ఈ విధంగా ప్రాజెక్టు అంచనాలను మొదట రూ. 81 వేల కోట్లకు, ఆ తర్వాత రూ. లక్ష కోట్లకు పెంచేసి, చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చును ఏకంగా రూ. 1.47 లక్షల కోట్లకు చేర్చారని కాగ్ (CAG) నివేదిక తేల్చిచెప్పిందని సీఎం స్పష్టం చేశారు. ఇంత భారీగా నిధులు ఖర్చు పెట్టి, నివేదికలు మార్చినప్పటికీ లక్షిత ఆయకట్టు మాత్రం ఏ మాత్రం మారలేదని ఎండగట్టారు.
నిర్మాణ లోపాలు.. కుంగిపోయిన మేడిగడ్డ
ప్రాజెక్టు అంచనాలు పెంచినప్పటికీ క్వాలిటీ విషయంలో ఘోరంగా విఫలమయ్యారని, అందుకే కట్టిన ఏడాదిలోపే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నాటి ప్రాజెక్టు ఏఈనే లోపాలను బయటపెట్టారని, అయినా సమస్యను గుర్తించకపోవడం వల్లే బ్యారేజ్ కూలిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. 2022లో వచ్చిన వరదలకు కన్నెపల్లి పంప్‌హౌస్ మునిగిపోయిందని గుర్తుచేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కింద అసలు ఆయకట్టే లేదని, అయినా కేవలం నీళ్లు చూపించాలనే ప్రచార ఆర్భాటంతో ఇసుక పునాదులపై బ్యారేజ్ కట్టడం వల్లే పిల్లర్లు కుంగాయని సీఎం స్పష్టం చేశారు. నిపుణుల కమిటీ నివేదికను తాము ప్రజల ముందుంచామని, ఆ నివేదికల ప్రకారమే తమ ప్రభుత్వం కాళేశ్వరంపై తదుపరి చర్యలతో ముందుకు వెళ్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
