ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకోవాలి
తంగడపల్లి పిహెచ్‌సిలో ఘనంగా ‘ఆశా డే’ నిర్వహణ
జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయకర్త డా. సూర్యశ్రీ రావు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేరు నమోదు చేయించుకుని, అక్కడే కాన్పులు (డెలివరీలు) చేయించుకునేలా వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ప్రోత్సహించాలని జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయకర్త (DCHS) చౌటుప్పల్ సీహెచ్‌సీ సూపరిండెంట్ డాక్టర్. సూర్యశ్రీ రావు పిలుపునిచ్చారు. మంగళవారం తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) వైద్యాధికారి డాక్టర్ చింతకింది కాటం రాజు ఆధ్వర్యంలో జరిగిన ‘ఆశా డే’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ సూర్యశ్రీ రావు మాట్లాడుతూ.. గర్భిణులు క్రమం తప్పకుండా స్త్రీ వైద్య నిపుణులచే వైద్య పరీక్షలు చేయించుకుని, వారి సూచనలు పాటించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు చేయించడం వల్ల పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, అనవసరమైన సిజేరియన్ ఆపరేషన్లు తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉంటారని, త్వరలోనే 100 పడకల ఆసుపత్రిని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆమె వెల్లడించారు.
మండల వైద్యాధికారి డాక్టర్ కాటంరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా చూడాలని, ఏ ఒక్కరు కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా గర్భిణులను ప్రభుత్వ ఆసుపత్రులకు ఆశాలు తోడుగా తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుమన్ కళ్యాణ్, ఆర్‌ఎమ్‌ఓ డాక్టర్ పాండురంగం, గైనకాలజిస్ట్ డాక్టర్ రజిని, ఎమ్‌ఎల్‌హెచ్‌పీలు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎమ్‌లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
