మావోయిస్టుల కన్నా గంజాయి స్మగ్లర్లు ప్రమాదకరం
- గంజాయి స్మగ్లర్ల ద్వారా ప్రతి కుటుంబంలో ఒకరు బలవుతున్నారు
- గంజాయి అక్రమ రవాణాదారుల ఆస్తులు జప్తు
- పీడీ యాక్ట్‌లకు రంగం సిద్ధం
- మాదక ద్రవ్యాల, గంజాయి రహిత రాష్ట్రం కోసం పటిష్ట చర్యలు
- నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
- నేరస్థులకు శిక్షలు పడే విధంగా చర్యలు
- పగలు, రాత్రులు ముమ్మరంగా పెట్రోలింగ్
- రౌడీషీటర్లు, పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా
- ఖమ్మం జిల్లాలో నేరాలు నియంత్రణలో ఉన్నాయి
- సీపీ సునీల్‌దత్‌కు, పోలీస్ అధికారులకు ప్రశంసలు
- ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు
- విలేకరుల సమావేశంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్
ఖమ్మం, ఆంధ్రప్రభ: మావోయిస్టుల కన్నా గంజాయి స్మగ్లర్లు అత్యంత ప్రమాదకరంగా మారారని గంజాయి స్మగ్లర్ల ద్వారా ప్రతి కుటుంబంలో ఒక యువకుడు మత్తుకు బానిస అవుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. గత రెండు రోజులుగా ఖమ్మంలో పర్యటిస్తున్న ఆయన నేడు ఎస్‌బి కాన్ఫరెన్స్ హాల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి స్మగ్లర్లపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకొని తెలంగాణను మాదక ద్రవ్యాలు, గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని అన్నారు. భవిష్యత్తులో మరింత కఠినంగా వ్యవహరించి గంజాయి స్మగ్లర్ల ఆస్తులను సైతం జప్తు చేసి పీడీయాక్ట్ అమలు చేయనున్నట్లు, ఇప్పటికే చర్యలు తీసుకున్నామని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రతి జిల్లాని ప్రత్యేకంగా సందర్శించి క్షేత్ర స్థాయిలో పనితనాన్ని పరిశీలిస్తున్నామని దానిలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు రోజుల కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొని సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పోలీసింగ్‌పై దిశానిర్ధేశాలు చేశామని అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నామని పేర్కొన్నారు. అనంతరం గత మూడు సంవత్సరాల సమీక్ష సమావేశం నిర్వహించామని తెలిపారు.
గత మూడు సంవత్సరాలతో పోలిస్తే ఖమ్మం జిల్లాలో పోలీసింగ్ సంతృప్తిని ఇచ్చిందని నేరాల నియంత్రణలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా గంజాయి అక్రమ రవాణా, సైబర్‌క్రైమ్, ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. పోలీసింగ్ బలపరిచి గట్టిగా పోలీసింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
నేర నియంత్రణకు కేసులు నమోదు చేసి ముద్దాయిలను కేవలం అరెస్టు చేయటంతోనే సరిపోదని న్యాయ వ్యవస్థలో వారికి శిక్షలు పడే విధంగా చేయటం సైతం పోలీసుల బాధ్యత అని అన్నారు. పెట్రోలింగ్ వ్యవస్థను పూర్తిగా పటిష్టపరిచి నేరాల నియంత్రణ చేయుటకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కేసులను ఆన్‌లైన్ చేయటంలో కొన్ని లోపాలున్నాయని వాటిని కూడా సరిచేయనున్నట్లు తెలిపారు.
సాంకేతికతను వినియోగించుకొని ఏఐ, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో కేసుల పూర్తి వివరాలు ఆన్‌లైన్ అయ్యే విధంగా చేస్తున్నామన్నారు. ప్రధానంగా గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినట్లు దీనిపై ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణాకు ఖమ్మం జిల్లాకు సరిహద్దు రాష్ట్రాలు ఉండటం వల్ల ఖమ్మం మీదుగా గంజాయి అక్రమ రవాణా గతంలో సాగిందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం ద్వారా ఆదిలోనే అంతమొందించిన విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు పెరుగుతున్నాయని, వ్యాపారస్థులు, రిటైర్డు ఉద్యోగులను టార్గెట్ చేసి సైబర్ నేరాలు జరుగుతున్నాయని అన్నారు. ఫిర్యాదుదారులకు, ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ప్రతి రోజు ఖచ్చితంగా మూడు గంటల నుంచి అయిదు గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నూతన పద్ధతిని ఏర్పాటు చేశామని తెలిపారు.
ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక విభాగం త్వరలో చేపట్టనున్నట్లు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం టీ మాస్ స్పెషల్ బ్యూరో ఏర్పాటవుతుందని ప్రకటించారు. ప్రతి అధికారి నిబద్ధతతో పని చేయాలని ఫ్రెండ్లీ పోలీసింగ్‌లా కాకుండా గట్టి పోలీస్‌గా వ్యవహరించాలని నేరస్థుల పట్ల ఉదాసీనత ఉండకూడదని తెలిపారు. అధికారులు సైతం ప్రలోభాలకు గురై కేసులు పక్కతోవ పట్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చర్యలుంటాయని పేర్కొన్నారు. పోలీసుల్లో అవినీతి ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు ఏర్పాటు చేసినట్లు, అవినీతి అధికారులపై ఫిర్యాదు వస్తే ఎంతటి అధికారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఖమ్మం జిల్లా పోలీసింగ్‌పై సంతృప్తి ..
సీపీ సునీల్‌దత్, అధికారులను అభినందించిన డీజీపీ సీవీ ఆనంద్
ఖమ్మం జిల్లాలో గత మూడు సంవత్సరాల నేరాల నియంత్రణలో ఖమ్మం జిల్లాలో నేరాల నియంత్రణ జరిగిందని ఖమ్మం జిల్లాలో పోలీస్ అధికారుల పనితీరు సంతృప్తిని ఇచ్చిందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. గతంతో పోలిస్తే నేరాలు నియంత్రణలో ఉండటం, కేసులు త్వరితగతిన పరిష్కరించబడ్డాయని నేరస్తులకు శిక్ష పడటంలో సైతం ఖమ్మం జిల్లా పోలీసుల పనితీరు బాగుందని ప్రశంసించారు. ప్రధానంగా గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రత్యేక పనితీరును కనబరిచారని హర్షించారు.
గంజాయిని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థులను అదుపులోకి తీసుకోవటంలో ప్రతిభ కనబరిచారని కోట్ల రూపాయల గంజాయిని స్వాధీనపరుచుకుని నిర్వీర్యం చేశారని అన్నారు. పాతనేరస్థులపై నిఘా, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు బాగా పని చేస్తున్నాయని కితాబిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్, కల్లూరు ఏసీపీ వసుంధరయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
