అనుమానమే ప్రాణం తీసింది!
- నలుగురు నిందితుల అరెస్ట్
- వివాహేతర సంబంధం అనుమానంతో హత్య
- హత్య కేసును ఛేదించిన పోలీసులు
రేగొండ, ఆంధ్రప్రభ: రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసును పోలీసులు ఛేదించి, ఈ కేసులో ప్రమేయం ఉన్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు మేజర్లు, ఒకరు మైనర్ ఉన్నట్లు డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మేరకు నిందితులు దమ్మన్నపేట క్రాస్ మీదుగా ప్రయాణిస్తున్నట్లు తెలుసుకున్న రేగొండ ఎస్సై సుధాకర్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని టీవీఎస్ స్కూటీపై వస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డీఎస్పీకి సమాచారం అందించి వారిని విచారించారు.
పోలీసుల దర్యాప్తులో ప్రధాన నిందితుడు మల్లెబోయిన శ్రీకాంత్ (30) తన భార్యతో మృతుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో పాటు, రూ.5 లక్షలు అప్పుగా తీసుకుని తరచూ డబ్బులు అడుగుతున్నాడనే కారణాలతో అతనిపై కక్ష పెంచుకున్నట్లు, ఈ క్రమంలో తన సోదరుడు మల్లెబోయిన చింటు (22), మరో ఇద్దరు సహచరులు సందీప్ (25), మైనర్ బాలుడితో కలిసి హత్యకు పథకం రచించినట్లు విచారణలో తేలింది.
పథకం ప్రకారం ముందుగానే తల్వార్, కత్తి కొనుగోలు చేసి దాచిపెట్టి, జూలై 3 శుక్రవారం రాత్రి సుమారు 10 గంటలకు మృతుడు పనిచేస్తున్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన తల్వార్, కత్తి, రక్తపు మరకలతో ఉన్న దుస్తులు, నేరానికి వినియోగించిన టీవీఎస్ స్కూటీ, యమహా ఎఫ్‌జెడ్ మోటార్‌సైకిల్, మొబైల్ ఫోన్‌ను స్వతంత్ర పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, వారికి రిమాండ్ విధించినట్లు డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

