మైనార్టీల అభ్యున్నతికి సహకరించండి..
విజయవాడ, ఆంధ్రప్రభ : కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుని బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీల అభ్యున్నతికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నేషనల్ మైనారిటీస్ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణ పథకాల పునరుద్ధరణతో పాటు రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ రీవాలిడేషన్‌కు సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే సుమారు రూ.345 కోట్ల కార్యాచరణ ప్రణాళిక ద్వారా రాష్ట్రంలోని సుమారు 11,200 మంది మైనారిటీ లబ్ధిదారులకు స్వయం ఉపాధి, వ్యాపార రుణాలు, సూక్ష్మ రుణాలు, విద్యా రుణాలు తదితర ఆర్థిక సహాయాన్ని అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పథకాల అమలుతో మైనారిటీ యువత, మహిళలు, చిన్న వ్యాపారులు, నిరుద్యోగులకు విశేష ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. మైనారిటీ వర్గాల ఆర్థిక సాధికారతకు కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావాన్ని సయ్యద్ బాషా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్‌పర్సన్ జకియా ఖానం , తదితరులు పాల్గొన్నారు
