నగర ట్రాఫిక్‌కు పర్మనెంట్ సొల్యూషన్
- హుమ్టా (HUMTA) బలోపేతానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
- 4 ప్రత్యేక వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు!
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం చూపడంతో పాటు సమగ్ర పట్టణ రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (HUMT)ను బలోపేతం చేసే దిశగా నాలుగు ప్రత్యేక వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం జీఓ 656ను జారీ చేసింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగు వర్కింగ్ గ్రూపులు నగర రవాణా విధానాల రూపకల్పన, స్మార్ట్ మొబిలిటీ ప్రణాళికలు, రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్ ప్రతిపాదనల సమీక్ష, ప్రజా స్థలాల వినియోగంపై నియంత్రణ, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ అమలు వంటి కీలక అంశాలపై పనిచేయనున్నాయి.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో రవాణా ప్రణాళిక, ట్రాఫిక్ నిర్వహణ, రోడ్ల అభివృద్ధి, సాంకేతిక ఆధారిత సేవలను ఒకే వేదికపై సమన్వయం చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ మెట్రో రైల్, టీజీఎస్‌ఆర్టీసీ, ట్రాఫిక్ పోలీసులు, దక్షిణ మధ్య రైల్వే, హైడ్రా, టీజీఎస్‌పీడీసీఎల్, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ తదితర కీలక శాఖల ప్రతినిధులు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉంటారు.
వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, రవాణా ప్రాజెక్టులను వేగవంతం చేయడం, శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం, ఆధునిక సాంకేతికతతో ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో హైదరాబాద్‌లో సమగ్ర, సురక్షిత, సుస్థిర రవాణా వ్యవస్థ ఏర్పాటుకు బాటలు పడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రతి వర్కింగ్ గ్రూప్‌కు సంబంధిత ఉన్నతాధికారి అధ్యక్షత వహించగా, హువ్టూ మేనేజింగ్ డైరెక్టర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ గ్రూపులు నిర్దిష్ట వ్యవధిలో సమావేశమై తమ సిఫార్సులను హువ్టూ బోర్డుకు సమర్పించనున్నాయి. బోర్డు ఆమోదించిన నిర్ణయాలను సంబంధిత శాఖలతో సమన్వయం చేసి అమలు చేయించే బాధ్యతను హువ్టూ మేనేజింగ్ డైరెక్టర్‌కు ప్రభుత్వం అప్పగించింది.
ప్రణాళికలు – స్మార్ట్ అర్బన్ మొబిలిటీ..
పాలసీ, ప్రణాళికలు – స్మార్ట్ అర్బన్ మొబిలిటీ గ్రూప్ పట్టణ రవాణాకు సంబంధించిన సమగ్ర విధానాలు రూపొందించడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సుస్థిరమైన మొబిలిటీ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంతో పాటు సాంకేతిక ఆధారిత పరిష్కారాలను రూపొందిస్తుంది.
రోడ్ల అభివృద్ధి – ట్రాఫిక్ ప్రతిపాదనలు…
జంక్షన్‌ల అభివృద్ధి, ప్రధాన కారిడార్‌ల మెరుగుదల, స్కైవాక్‌లు, నాన్-మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్ (ఎన్‌ఎంటీ-) ప్రాజెక్టులు, ట్రాఫిక్ అధ్యయనాల ఆధారంగా వచ్చే ప్రతిపాదనలను పరిశీలించి అమలుకు సమన్వయం చేయనుంది. పాదచారుల మార్గాలు వంటి చిన్న, మధ్యస్థాయి రహదారి అభివృద్ధి పనులను సమీక్షించి అమలు చేస్తుంది.
అమలు, నియంత్రణ కమిటీ…
ప్రజా స్థలాల వినియోగంపై సమర్థవంతమైన నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల అమలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, నగరంలో సురక్షితమైన రవాణా వాతావరణం కల్పించే చర్యలపై దృష్టి సారించనుంది.
ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్..
ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఐటీఎంఎస్) గ్రూప్ ఆధునిక సాంకేతికత ఆధారంగా రియల్ టైమ్ ట్రాఫిక్ నిర్వహణ, వివిధ రవాణా వ్యవస్థల అనుసంధానం, ట్రాఫిక్ డేటా సమీకరణ, విశ్లేషణకు అవసరమైన స్మార్ట్ వ్యవస్థలను అభివృద్ధి చేయనుంది. డిజిటల్ ట్రాఫిక్ పర్యవేక్షణకు కార్యాచరణ రూపొందిస్తుంది.
