సర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచాలి
- మున్సిపల్ చైర్పర్సన్ సంధ్యారాణి
క్యాతనపల్లి, ఆంధ్రప్రభ: పట్టణంలోని 17వ వార్డులో సోమవారం ప్రత్యేక ఓటర్ల జాబితా తీవ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ గోడిసెల సంధ్యారాణి, చెన్నూరు నియోజకవర్గ నాయకుడు డా. రాజా రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ, ప్రతి అర్హ భారతీయుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టిందన్నారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటికీ వెళ్లి సిబ్బంది ఎస్ఐఆర్ ఫారాలను అందజేసి వివరాలు సేకరిస్తారని తెలిపారు.
2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేస్తూ ఈ సవరణ చేపడుతున్నామని, దీని ద్వారా మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మారిన వారి వివరాల నవీకరణ, డూప్లికేట్ ఓటర్ ఐడీల తొలగింపు, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు వంటి ప్రక్రియలు జరుగుతాయని వివరించారు.
జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని, అందరూ తమ వివరాలను పరిశీలించి అవసరమైతే అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రామిడి కుమార్, లక్కీ రెడ్డి, బీఎల్ఏ రామిడి లక్ష్మీకాంత్, అప్పాల బాను, సౌజన్య, దేవి, నవీన్ మణి, బీఎల్వోలు విజయ, రాజేశ్వరి, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
