జవాన్ల కాన్వాయ్‌పై మిలిటెంట్ల మెరుపుదాడి..

  • ఇద్దరు జవాన్లు మృతి..
  • పలువురికి గాయాలు

ఆంధ్ర‌ప్ర‌భ : ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన దాడి తీవ్ర క‌ల‌క‌లం రేకెత్తించింది. ఉఖ్రుల్ జిల్లాలో అనుమానిత మిలిటెంట్లు జరిపిన మెరుపుదాడిలో (Ambush) ఇద్దరు అసోం రైఫిల్స్ జవాన్లు వీరమరణం పొందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

కదిలే కాన్వాయే లక్ష్యంగా…

పోలీసులు, భద్రతా బలగాల కథనం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో నుంగ్‌షాంగ్ ఖోంగ్ (Nungshang Khong) ప్రాంతం గుండా 40వ అసోం రైఫిల్స్‌కు చెందిన సైనిక కాన్వాయ్ వెళ్తుండగా, పొంచి ఉన్న మిలిటెంట్లు ఒక్కసారిగా ఎదురుకాల్పులకు తెగబడ్డారు.

ఊహించని ఈ ఆకస్మిక దాడితో అప్రమత్తమైన జవాన్లు తిప్పికొట్టే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే వాహనాల్లో ఉన్న ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ఇతర సైనికులను చికిత్స నిమిత్తం తక్షణమే సైనిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

తీవ్రంగా ఖండించిన హోం మంత్రి

ఈ ఘోర ఉగ్రదాడిని మణిపూర్ హోం మంత్రి గోవిందాస్ కొంతౌజం (Govindas Konthoujam) తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ.. “ఈ దాడి అత్యంత దురదృష్టకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో శాంతిభద్రతలను, సామరస్యాన్ని దెబ్బతీసేందుకే ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై భద్రతా సంస్థలు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాయనే నమ్మకం నాకుంది” అని పేర్కొన్నారు.

కొనసాగుతున్న ఉద్రిక్తతలు

మణిపూర్‌లో 2023 మే నెల నుండి మైతేయి (Meitei), కుకీ-జో (Kuki-Zo) వర్గాల మధ్య జరుగుతున్న జాతి హింస కారణంగా ఇప్పటికే 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. శాంతి స్థాపన కోసం భద్రతా బలగాలు నిరంతరం శ్రమిస్తున్న తరుణంలో, తాజాగా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది.