నిరుపేదలకు వరంగా మెగా సర్జికల్ క్యాంప్

  • వైద్య సేవల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రత్యేక చొరవ
  • రాష్ట్రానికే ఆదర్శంగా అచ్చంపేట ప్రాంతీయ ఆసుపత్రి
  • త్వరలో బ్లడ్ బ్యాంక్, ఐసీయూ, ట్రామా కేర్ ఏర్పాటు : ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట, ఆంధ్రప్రభ : ఆర్థికంగా వెనుకబడిన నల్లమల్ల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ డాక్టర్ మల్లు రవి ప్రోత్సాహంతో అచ్చంపేట పట్టణ ప్రాంతీయ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న నాలుగో ఉచిత మెగా సర్జికల్ క్యాంప్ మూడో రోజు ముగిసే నాటికి మొత్తం 250 మంది రోగులకు విజయవంతంగా ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర వైద్య సిబ్బంది సమన్వయంతో క్యాంపు విజయవంతంగా కొనసాగుతోందని, సేవలందించిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు.

ఈ మెగా సర్జికల్ క్యాంపుకు అచ్చంపేట పరిసర ప్రాంతాలతో పాటు దేవరకొండ, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, వనపర్తి తదితర ప్రాంతాల నుంచి కూడా రోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని తెలిపారు. ఇప్పటికే నమోదు చేసుకున్న వారికి అవసరమైతే మరో రోజు క్యాంపు నిర్వహించి శస్త్రచికిత్సలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. క్యాంపులో ప్రధానంగా గర్భసంచి సంబంధిత సమస్యలు, అన్ని రకాల హెర్నియా, అపెండిసైటిస్, కణితుల తొలగింపు వంటి శస్త్రచికిత్సలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు నిర్వహించిన నాలుగు మెగా సర్జికల్ క్యాంపుల్లో 1,770 మంది రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా శస్త్రచికిత్సలు చేసినట్లు తెలిపారు.

ల్యాబ్ పరీక్షలు, మందులు, భోజనం, శస్త్రచికిత్సలు అన్నీ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. అచ్చంపేట డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రకుమార్ సుమారు రూ.3 లక్షల విలువైన సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్లను విరాళంగా అందించి క్యాంపు విజయానికి తోడ్పడ్డారని ఎమ్మెల్యే ప్రశంసించారు. అచ్చంపేట ప్రాంతీయ ఆసుపత్రిలో త్వరలోనే బ్లడ్ బ్యాంక్, ఐసీయూ, ట్రామా కేర్ యూనిట్లు ఏర్పాటు కానున్నాయని, ప్రస్తుతం ఉన్న 5 పడకల డయాలసిస్ యూనిట్‌ను 10 పడకలకు విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

అచ్చంపేట డయాలసిస్ యూనిట్‌కు జాతీయ స్థాయిలో అవార్డు రావడం ప్రాంతానికి గర్వకారణమన్నారు. అలాగే సీటీ స్కాన్ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలు, పూర్తి స్థాయి వైద్యుల నియామకం ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. నియోజకవర్గంలోని సురాపూర్, మాధవానిపల్లి, హాజీపూర్, వెల్టూర్ గ్రామాల్లో కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరయ్యాయని, అచ్చంపేటను మెడికల్ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అచ్చంపేట ప్రాంతీయ ఆసుపత్రిని రాష్ట్రంలోనే ఆదర్శప్రాయ వైద్యసంస్థగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు.