జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం.
జగన్ వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధం.
కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు
కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల రాయలసీమ అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, ఆయన పాలనలోనే రాయలసీమ అన్ని రంగాల్లో తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఖూడా) చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు.
ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాయలసీమకు జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు. ముఖ్యంగా కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించినప్పటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ అంశాన్ని ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
రాయలసీమలో పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, విద్యా–వైద్య రంగాల అభివృద్ధి వంటి అంశాల్లో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ అభివృద్ధికి అవసరమైన ప్రత్యేక కార్యాచరణను అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందన్నారు.
2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న సమయంలో కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదని విమర్శించారు. అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప రాయలసీమకు శాశ్వత ప్రయోజనం చేకూరే ఒక్క ప్రధాన ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని అన్నారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, పరిశ్రమల ఏర్పాటు, రహదారుల విస్తరణ, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాల్లో వేగంగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కర్నూలును అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేలా జగన్ చేస్తున్న వ్యాఖ్యలను రాయలసీమ ప్రజలు విశ్వసించరని, గత పాలనలో జరిగిన నిర్లక్ష్యాన్ని ప్రజలు మరచిపోలేదని సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలను ప్రజలకు చెప్పాలని, రాజకీయ విమర్శలకు బదులుగా తన పాలనలో చేసిన పనులను వివరించాలని ఆయన సవాల్ విసిరారు.
