BJP | పేదల ఇళ్లే లక్ష్యమా
BJP | ఆంధ్రప్రభ, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బీజేపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లిందని విమర్శించారు.
హైడ్రా చర్యలపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కూల్చివేస్తూ, అక్రమ నిర్మాణాల విషయంలో ఎంఐఎంపై మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. చట్టం అందరికీ సమానంగా అమలు కావాలని, ఎంపిక చేసిన వారిపైనే చర్యలు తీసుకోవడం సరికాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని, రాజకీయ ఆరోపణలు, పరస్పర విమర్శలతో కాలక్షేపం చేయకుండా అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని రాంచందర్‌రావు సూచించారు.
