మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయాలి..

  • కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ లేఖలు..
  • ఫేజ్-1 స్వాధీనం ప్రక్రియ వేగవంతం చేయాలని విజ్ఞప్తి..
  • ఎస్‌బీఐ క్యాప్స్ నియామకంలో జాప్యంపై ఆందోళన
  • జాప్యం కొనసాగితే వ్యయం పెరుగుతుందని హెచ్చరిక..
  • కేంద్రం తక్షణ జోక్యం కోరిన ముఖ్యమంత్రి

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ (ఫేజ్-2) విస్తరణ, తొలి దశ (ఫేజ్-1) స్వాధీనం ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి లేఖలు రాసి, పెండింగ్‌లో ఉన్న ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ మెట్రో రైలు భవిష్యత్ విస్తరణకు సంబంధించిన కీలక అంశాలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేసింది. మెట్రో ఫేజ్-2 విస్తరణకు అవసరమైన అనుమతులు, ఆర్థిక ప్రక్రియలు వేగవంతం చేయడంతో పాటు, ప్రస్తుతం అమలులో ఉన్న మెట్రో ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి పంపిన లేఖల్లో ఇటీవల జూన్ 23, 24 తేదీల్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఆ సమావేశాల్లో మెట్రో ఫేజ్-1 ఆస్తుల విలువను నిర్ధారించడం (వాల్యుయేషన్), అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ (రిఫైనాన్సింగ్), అలాగే మెట్రో ఫేజ్-2కు అవసరమైన దీర్ఘకాలిక నిధుల సమీకరణపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ నోడల్ సంస్థ ఎస్‌బీఐ క్యాప్స్‌ను నియమించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు.

అయితే ఇప్పటివరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR) ఖరారు చేయకపోవడంతో పాటు, ఎస్‌బీఐ క్యాప్స్‌కు అధికారికంగా బాధ్యతలు అప్పగించడంలో జాప్యం జరుగుతోందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆలస్యం కారణంగా మెట్రో ఫేజ్-1 నిర్వహణలో అనిశ్చితి నెలకొంటోందని, ఫేజ్-2కు సంబంధించిన డీపీఆర్‌ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు కూడా ముందుకు సాగడం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్టు అమలు మరింత ఆలస్యమయ్యే ప్రమాదంతో పాటు నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని మెట్రో ఫేజ్-2 విస్తరణ అత్యంత కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కేంద్ర మంత్రులు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఎస్‌బీఐ క్యాప్స్ నియామక ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కోరారు. దీంతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటికే కుదిరిన ఒప్పందాల అమలు వేగవంతమై, మెట్రో ఫేజ్-1 స్వాధీనం ప్రక్రియ త్వరగా పూర్తవడంతో పాటు ఫేజ్-2 విస్తరణ పనులు కూడా ఎలాంటి జాప్యం లేకుండా ముందుకు సాగే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.