సిద్ధాంత అవగాహనతోనే ప్రజా ఉద్యమాలు బలోపేతం

  • కొత్తగూడెం ఎమ్మెల్యే,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

తొర్రూరు, ఆంధ్రప్రభ : సిద్ధాంతపరమైన అవగాహనతోనే ప్రజా ఉద్యమాలు బలోపేతం అవుతాయని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం స్థానిక లయన్స్ భవన్‌లో సీపీఐ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి సిద్ధాంతపరమైన అవగాహన, క్రమశిక్షణతో కూడిన రాజకీయ చైతన్యం అవసరమని అన్నారు. సమాజంలో మారుతున్న పరిస్థితులను అధ్యయనం చేస్తూ ప్రజల పక్షాన ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

అయోధ్య రామాలయాన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పై ఆయన విమర్శలు చేశారు. ఆలయ నిర్మాణం అనంతరం భక్తులు సమర్పించిన నగదు, విలువైన కానుకలు, వెండి ఇటుకల వినియోగంపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినా అందించడం లేదని, ట్రస్ట్ పేరుతో బాధ్యత నుంచి తప్పించుకోవడం సరికాదన్నారు.

అయోధ్య రామ మందిరంతో పాటు కేదార్‌నాథ్ ఆలయానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై కూడా సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు.

అనంతరం వివిధ అంశాలపై రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ‘మార్క్సిజం – సమకాలీన సమాజంలో దాని ప్రాధాన్యత’ అంశంపై కామ్రేడ్ మధుకర్, ‘తీవ్ర ఆర్థిక సంక్షోభంలో భారతదేశం – పర్యవసానాలు’ అంశంపై కామ్రేడ్ బీఎస్‌ఆర్ మోహన్ రెడ్డి, ‘మతం, మతోన్మాదం – లౌకికవాదం – కేంద్రంలో అమలవుతున్న హిందుత్వ ఎజెండా’ అంశంపై కామ్రేడ్ ఉమా మహేష్ బోధనలు నిర్వహించి నాయకులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయ్ సారధి, జిల్లా సహాయ కార్యదర్శులు బి. అజయ్ సారధి, నల్లు సుధాకర్, రాష్ట్ర సమితి సభ్యుడు కట్టబోయిన శ్రీనివాస్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ మాజీ సభ్యుడు తమ్మెర విశ్వేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు మామిడ్ల సాంబాలక్ష్మి, పెరుగు కుమార్, వరిపెల్లి వెంకన్న, చింతకుంట్ల వెంకన్న, రేషపల్లి నవీన్, పాండురంగాచారి, నెల్లూరి నాగేశ్వరరావు, తొర్రూరు మండల కార్యదర్శి బందు మహేందర్, సహాయ కార్యదర్శులు గణపురం లక్ష్మణ్, పెరబోయిన కిరణ్, జిల్లాలోని వివిధ మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.