పుష్కరాల నాటికి ఆలయాలకు ప్రత్యేక శోభ..

  • సీఎం ముందుచూపుతో పుష్కర పనులు
  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

వెల్గటూర్, ఆంధ్రప్రభ : గోదావరి పుష్కరాలకు ముందే గోదావరి తీరంలోని ఆలయాలకు కొత్త శోభ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలోని శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి పుష్కరాలకు ఏడాది ముందుగానే ఏర్పాట్లు చేయడానికి బడ్జెట్ లో నిధులు కేటాయించారన్నారు. గోదావరి తీరం వెంట బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు, ఇందులో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి నిధులు కేటాయించడంతో పాటు కోటిలింగాలలోని కోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారన్నారు.

ధర్మపురి నియోజకవర్గానికి పుష్కర పనుల కోసం రూ.117 కోట్లు కేటాయించగా ఇందులో కోటిలింగాలలో పుష్కర ఘాట్ నిర్మాణానికి రూపాయలు 8 కోట్లు కోటిలింగాల నుండి పాశీగాం వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 8 కోట్లు కేటాయించినట్లు, ధర్మపురి ఉగ్ర నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 10 కోట్లు కేటాయించగా, వెల్గటూర్ నుండి కోటిలింగాల వరకు నాలుగు లైన్ల రహదారి విస్తరణ కొరకు రూ. 20 కోట్లు కేటాయించారన్నారు. కోటిలింగాలతోపాటు రాజక్క పల్లి వద్ద మిని ట్యాంక్ బండ్ మాదిరిగా నిర్మాణం చేస్తామని, పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు.