అధికారులకు పీఆర్పీ వెంటనే చెల్లించాలి..
- లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం..
- సీఎమ్ఓఏఐ రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపిన బి.ఎం.ఎస్
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సింగరేణి అధికారులకు పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ( పిఅర్పి )తో పాటు పే అప్‌గ్రేడ్‌ను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ఎస్సిఎంకెఎస్ – బిఎంఎస్) అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ హెచ్చరించారు. భూపాలపల్లి ఏరియాలో కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ ) చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం ఏడో రోజుకు చేరుకున్న సందర్భంగా ఆయన సంఘీభావం తెలిపారు. సింగరేణి అభివృద్ధి, బొగ్గు ఉత్పత్తిలో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి రావాల్సిన పీఆర్పీని చెల్లించకపోవడం, పే అప్‌గ్రేడ్‌ను అమలు చేయకపోవడం అన్యాయమన్నారు.
అధికారుల సమస్య పరిష్కారానికి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి అంశాన్ని తీసుకెళ్లినట్లు తెలిపారు. అధికారులకు పీఆర్పీ చెల్లింపులో ఎలాంటి సాంకేతిక లేదా పరిపాలనా అడ్డంకులు లేవని, అయినప్పటికీ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం జాప్యం చేయడం వల్ల అధికారుల్లో అసంతృప్తి పెరుగు తోందన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించకపోతే పారిశ్రామిక శాంతికి భంగం కలిగే పరిస్థితులకు ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెలబోయిన సుజేందర్, పని రమేష్, ఎం.డి. యూసుఫ్, కొత్తూరి మల్లేశ్, శ్రీనివాస్, పునీత్ రావు, రాజు, దొంగల రాజేందర్, బట్టు రవి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
