ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో ఒరిజినల్ సర్టిఫికెట్లు నిలిపివేసిన జేఎన్టీయూ..
- విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే తీవ్ర ఆందోళనలు తప్పవు
- మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా హెచ్చరిక
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదనే కారణంతో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు నిరాకరించడం అత్యంత దారుణమైన, అన్యాయమైన చర్య అని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
పెద్దపల్లి జిల్లాలోని మంథని జేఎన్టీయూ ప్రభూత్వ కళాశాలలో 2026 బ్యాచ్‌కు చెందిన బీటెక్ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాకపోవడంతో ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ విషయమై జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ద్రుష్టికి తీసుకెళ్లినా, జిల్లా కలెక్టర్, మైనారిటీ సంక్షేమ అధికారుల ముందు విధ్యార్దులు పలుమార్లు తమ గోడు వెల్లబుచ్చినా ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లభించకపోవడం విచారకరమన్నారు.
ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధుల భారాన్ని విద్యార్థులపై మోపడం, వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను బందీ చేయడం చట్టవిరుద్ధమే కాకుండా వారి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసే చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మైనార్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే సంబంధిత కళాశాల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వ, ప్ర్రయివేటు కాలేజీలలో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులందరికీ ఒరిజినల్ సర్టిఫికెట్లు అందేలా రాష్ట్ర ప్రభుత్వం, జేఎన్టీయూ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని, ఆ పరిస్థితికి ప్రభుత్వం, సంబంధిత అధికారులు పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని యాకూబ్ పాషా హెచ్చరించారు.
