కాళేశ్వరంలో కేటీఆర్ పర్యటన.. బీఆర్ఎస్ నేతలకు పోలీసుల అడ్డుకట్ట
మహాదేవ్‌పూర్, ఆంధ్రప్రభ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో ఆదివారం కాళేశ్వరం ప్రాంతమంతా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా సరిహద్దుల నుంచే వాహనాల తనిఖీలు చేపట్టడంతో పాటు, కాళేశ్వరం గ్రామంలోకి వచ్చే అన్ని ప్రధాన మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నాయకులు, కార్యకర్తల రాకపోకలను నియంత్రించారు. గ్రామ ప్రవేశ ద్వారాలు, ప్రాజెక్టు పరిసరాలు, ప్రధాన కూడళ్లు, దేవాలయ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి మూడంచెల భద్రత కల్పించారు.
ఈ సందర్భంగా శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదన్ చారి తన అనుచరులతో కలిసి కాళేశ్వరం వైపు వెళ్తుండగా మద్దులపల్లి క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కేవలం నాలుగు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేయడంతో అక్కడ కొంతసేపు బీఆర్ఎస్ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం సిరికొండ మధుసూదన్ చారికి మాత్రమే అనుమతి ఇచ్చి, ఆయన వెంట వచ్చిన పలువురు నాయకులు, కార్యకర్తలను అక్కడే నిలిపివేశారు.
కేటీఆర్ పర్యటనను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగించారు. గ్రామమంతా పోలీసు వాహనాల రాకపోకలు పెరగడంతో భద్రతా వాతావరణం నెలకొంది.
కేటీఆర్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల రాకపోకలపై విధించిన పరిమితులు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
