వైభవంగా నల్లపోచమ్మ, కట్ట మైసమ్మ బోనాల వేడుకలు

కడెం, ఆంధ్రప్రభ : మండల కేంద్రం కడెంలో ఆదివారం శ్రీ నల్లపోచమ్మ తల్లి, కట్ట మైసమ్మ తల్లి బోనాల వేడుకలను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు బోనాలను నెత్తిపై మోసుకుంటూ డప్పు చప్పుళ్ల నడుమ ఊరేగింపుగా కడెం ప్రాజెక్టు సమీపంలోని శ్రీ నల్లపోచమ్మ తల్లి, కట్ట మైసమ్మ తల్లి ఆలయాలకు చేరుకున్నారు. అక్కడ బోనాల నైవేద్యాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.

అనంతరం గొర్రెపోతును అమ్మవార్లకు బలిహారంగా సమర్పించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, పిల్లాపాపలు సుఖసంతోషాలతో ఉండాలని, పెద్దూరు గ్రామపంచాయతీ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా జీవించాలని గ్రామస్తులు అమ్మవార్లను ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో పెద్దూరు–కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్‌కుమార్, ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.