Chandrababu Naidu | ప్రతి నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యం: చంద్రబాబు

క్వాంటం, సెమీకండక్టర్ రంగాల్లో పెట్టుబడులు రానున్నాయని వెల్లడి..
డిసెంబరులో క్వాంటం సెంటర్ ప్రారంభం
హంద్రీ–నీవా ద్వారా నీరు అందించాం..
గాలేరు ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని సీఎం హామీ

Chandrababu Naidu | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా అన్ని నియోజకవర్గాలకు విస్తరించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తెలిపారు. కుప్పం నియోజకవర్గానికి భారీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు తీసుకొస్తున్నామని, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

కుప్పం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కుప్పానికి భారీ పరిశ్రమలు, ఆధునిక సాంకేతిక ప్రాజెక్టులు తీసుకురావడంతో పాటు అన్ని రంగాల్లో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న సీఎం, ప్రతి నియోజకవర్గాన్ని సమానంగా అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్వాంటం టెక్నాలజీ, సెమీకండక్టర్ వంటి అత్యాధునిక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని వెల్లడించారు. డిసెంబరు నెలలో క్వాంటం సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

కుప్పం ప్రాంతంలో ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని, ప్రజలకు శాశ్వత పరిష్కారాలు అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. నీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే, హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా కుప్పానికి సాగు, తాగునీరు అందించామని, త్వరలో గాలేరు ప్రాజెక్టును కూడా పూర్తి చేసి మరింత నీటి వనరులు అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం తెలిపారు.

ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై కూడా చంద్రబాబు విమర్శలు చేశారు. పరిశ్రమలను ప్రోత్సహించే బదులు వాటిని రాష్ట్రం నుంచి వెళ్లిపోయే పరిస్థితి కల్పించారని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాలను గంజాయి సాగుకు కేంద్రాలుగా మార్చారని, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు నిధులు వెచ్చిస్తున్నారని విమర్శించారు.

హింసాత్మక రాజకీయాలు, వ్యక్తిగత దూషణలే వైసీపీ రాజకీయ విధానంగా మారాయని ఆరోపించిన సీఎం, ప్రజలు అభివృద్ధి రాజకీయాలనే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.