చినుకు ప‌డితే చాలు.. బురదలోనే బతుకు

తొర్రూరు రూరల్, జూలై 5 (ఆంధ్రప్రభ): మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో కనీస మౌలిక వసతుల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల రూపాయల పన్నులు చెల్లిస్తున్నప్పటికీ రోడ్లు, డ్రైనేజీలు వంటి ప్రాథమిక సౌకర్యాల కల్పనలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మున్సిపాలిటీ 13వ వార్డులోని కాసం షాపింగ్ మాల్ వెనుక గల్లీలో స్వల్పంగా వర్షం కురిసినా రహదారి పూర్తిగా బురదమయంగా మారుతోంది. దీంతో కాలినడకన వెళ్లడం కష్టసాధ్యంగా మారడమే కాకుండా ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం నెలకొంటోంది. చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ఇబ్బందులు పడాల్సి వస్తోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యను పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు అలువాల వెంకటయ్య, మార్గం ఉపేందర్, ప్రసాద్ తెలిపారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో పరిస్థితి రోజురోజుకూ మరింత దారుణంగా మారుతోందని, ప్రజల ఇబ్బందులను గుర్తించి వెంటనే సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాలని వారు కోరారు.

ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడం మున్సిపాలిటీ బాధ్యత అని, సమస్య మరింత తీవ్రరూపం దాల్చకముందే అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.