మంత్రి లోకేష్‌కు దక్షిణ కొరియా ఆహ్వానం!

ఈనెల 5 నుంచి 11 వరకు అధికారిక పర్యటన..

పెట్టుబడులే ప్రధాన అజెండా

అమరావతి: భారత్–దక్షిణ కొరియా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు దక్షిణ కొరియాలో అధికారికంగా పర్యటించనున్నారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ పర్యటనలో వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో పాటు ప్రముఖ పారిశ్రామిక సంస్థలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్ (చెన్నై) చాంగ్ న్యూన్ కిమ్ పేర్కొన్నారు.

జూలై 5న సియోల్‌లో నిర్వహించే ఇండియా డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ భారతీయులు, తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జూలై 6న దక్షిణ కొరియా టెక్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం, పెట్టుబడి చర్చల్లో పాల్గొననున్నారు. అనంతరం హ్యోసంగ్ భారీపరిశ్రమల సంఘం అధ్యక్షుడు టకేషి యొకోటా, సియోల్ సెమికండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ టేహ్యుంగ్ లీతో సమావేశమవుతారు. జూలై 7న ఎల్‌జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ అధ్యక్షుడు యున్ జు కోహ్ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి హాజరై, ఎల్‌జీ అనుబంధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు.

జూలై 8న కొరియన్ మెరైన్ ఎక్విప్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో, జూలై 9న కొరియన్ పొలిటికల్ ఎఫైర్స్ డిప్యూటీ మంత్రి యుయి-హే సిసిలియా చుంగ్, కొరియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ డిప్యూటీ మంత్రి కాంచన్ కాంగ్‌లతో భేటీ కానున్నారు. జూలై 10న కొరియా ఆటో ఇండస్ట్రీ కోఆపరేషన్ ఏజెన్సీతో పాటు పలు సంస్థలతో పెట్టుబడి చర్చలు నిర్వహిస్తారు. అదే రోజు సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్–2026 విజయవంతానికి మద్దతుగా కొరియా కంపెనీల ప్రతినిధులతో రోడ్‌షోలో పాల్గొననున్నారు.